– ఈ నెల 16నగ్రామీణ భారత్‌బంద్‌కు సన్నద్ధం :
ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశం పూర్తిగా దివాలా తీసిందని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జాతీయ అధ్యక్షులు వేముల పల్లి వెంకట్రామయ్య తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు అధ్యక్షతన కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామయ్య మాట్లాడుతూ ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్, దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు కార్మికులు, కర్షకులు సన్నద్దవుతున్నారన్నారు. పదేండ్ల బీజేపీ ప్రభుత్వం మోసపూరిత నినాదాలతో ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర చెల్లిస్తామన్న హామీని మోడీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. రైతాంగ పోరాటానికి తలొగ్గి మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్న సందర్భంగా ఇచ్చిన హామీలను ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2024- 25 బడ్జెట్‌లో రైతాంగానికి మొండి చేయి చూపించారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయించకుండా దానిని నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, నాయకులు ఎం డేవిడ్ కుమార్, నందగిరి వెంకటేశ్వర్లు, సురేందర్, ఉమర్, లాల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.