ఏదో ఒక భూమి అనుకున్నాను గానీ
దగ్దభూమిగా నామకరణం చేసుకున్నట్లుంది !
మానవత్వం కబేళాలలో
మాంసపు ముద్దలుగా వేలాడుతున్నది
ఆనంద తాండవంలో మూర్ఖులు…
వాళ్ళకు కావలసింది మానాలు కాదు
ఖనిజాల గనులు
కసి తీర్చుకోవడానికి అంతం చేయడానికి
ఏ ఊరు ఏ కులమైతేం ఏ వర్గమైతేం
ఆమే మన చెల్లెమ్మనే మన అక్కనే
చిత్తు కాగితంలా దగ్ధం చేస్తున్నారు!
నిషాన్ లేకుండా కుట్రలు పన్నుతున్నారు. ..
చదువులు విద్వేషాలై
జెండాలూ బాకులై
మారణహోమాల్ని రగిలిస్తున్నయి
తరతరాల నాగరికతంతా దిగంబర దగ్దమే
అత్యాచార హత్యలే !
పంటసాలన్నీ
ముండ్ల కలుపుతో పరుచుకున్నయి చెరువులన్నీ
మురిక కంపలతో బిక్కు బిక్కుమంటున్నవి
ఒక బిల్కిస్ బానో ఒక గోద్రానో
ఒక ఒరిస్సానో, ఒక వాకపల్లినో, ఒక బెంగాల్ నో,
ఒక ఖైర్లాంజినో, ఒక నిర్బయనో, ఒక మరియమ్మనో,
ఒక మణిపూరో…
అన్నకు చెల్లెలుగా తమ్ముడికి అక్కగా భర్తకు భార్యగా
అన్నకు వదినగా బావకు అక్కగా తమ్ముడికి మరదలుగా
అమ్మగా, అమ్మమ్మగా, నాయనమ్మగా ఎన్నేన్ని రూపాలతో ఎన్ని పేర్లతో సకలసేవలలో అవని..
ఏ చెట్టు పూయడం లేదు
ఏ గాలీ వీయడం లేదు
ఏ మైక్ మాట్లడటం లేదు
సత్యాన్ని గంపకింద కోడిపిల్లా కమ్మేస్తున్నారు
అసత్యాన్ని బుల్డోజర్ లా నడిపిస్తున్నారు
కోర్టులే గాదు పార్లమెంటుకు గంతలు కట్టారు
ఇక వెదవ మాటలు చెప్పకండి!
స్త్రీలు ఎక్కడ పూజింపబడుతారో..
అక్కడే గౌరవమని
లక్ష్మీదేవతలని దేవతా మూర్తులని….
దేశం చచ్చిపోయింది
– వనపట్ల సుబ్బయ్య, 9492765358