వ్యవసాయరంగంలో దేశం ఎటుపోతున్నది?

వ్యవసాయరంగంలో దేశం ఎటుపోతున్నది?ప్రపంచంలో 144 కోట్లతో జనాభాలో మొదటి స్థానంలో ఉన్న భారతదేశంలో 53 శాతం ప్రజలు నేటికీ వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్నారు. 1965లో ప్రారంభించబడి 1980తో ముగిసిన కాలానికి అమలు జరిగిన హరిత విప్లవం వల్ల దేశం దిగుమతుల నుండి వ్యవసాయ ఎగుమతులకు ఉత్పత్తి, ఉత్పాదకత పెంచుకున్నాం. 1991 నుండి సంస్కరణలను ప్రవేశపెట్టిన నాటి ప్రధాని పి.వి. నర్సింహారావు వ్యవసాయ రంగానికి ప్రభుత్వం నుండి అందుతున్న సహయ సహకారాలను ఉపసంహరింప జేశాడు. దీనికి తోడు 1995లో ఏర్పడిన ”ప్రపంచ వాణిజ్య సంస్థ” ప్రపంచ దేశాల వ్యవసాయ రాయితీలపై ఆంక్షలు పెట్టింది. అయినప్పటికీ, జి-7 దేశాలు (అమెరికా, జర్మనీ, జపాన్‌, ఇంగ్లాండ్‌, ప్రాన్స్‌, ఇటలీ, కెనడా) తమ దేశాలలో వ్యవసాయ రాయితీలిస్తూ భారత దేశంలో వ్యవసాయ రాయితీలివ్వకుండా అంతర్జాతీయంగా ఒత్తిడితెచ్చి మన స్వయం పోషకత్వ విధానానికి ఆటంకం కల్పించారు. ఫలితంగా ఎగుమతుల నుండి దిగుమతుల స్థాయికి దిగజారిపోయాం. 2023లో మన దిగుమతులు వంటనూనెలు, పప్పులు, పండ్లు, కూరగాయలు ముతక ధాన్యాల ఉప ఉత్పత్తులు పంచధార, పత్తి, మాంసం, పాలు, పాల ఉత్పత్తులు తదితర దిగుమతులు 72 శాతానికి పెరిగాయి. ఒక వంటనూనెల దిగుమతులు 5 శాతం నుండి 9 శాతానికి పెరిగాయి.
”గ్లోబల్‌ ట్రేడ్‌ రిసెర్చ్‌ ఇన్సియేట్యూవ్‌” నివేదిక ప్రకారం భారత దేశం దిగుమతి సుంకాలు తగ్గించాలని, దిగుమతులకు స్వేచ్ఛాయుత వాతావ రణం కల్పించాలని చెప్పింది. ఒకవైపున బియ్యం ఎగుమతులు చేస్తునప్పటికీ, మరో వైపున బియ్యం ఉప ఉత్పత్తులు కూడా దిగుమతులు అవుతున్నాయి. వీటిపై సుంకాలు తగ్గించాలని అంతర్జాతీయ సమాజం మన పాలకులపై ఒత్తిడి తెస్తున్నది. 2017-18లో 10.8 బిలియన్‌ డాలర్ల నూనెల దిగుమతులు, 2023-24 నాటికి 20.8 బిలియన్‌ డాలర్లకు (బిలియన్‌ = 100 కోట్ల డాలర్లు), పెరిగింది. దిగుమతుల పెరుగుదల వల్ల స్థానిక ఉత్పత్తులు తగ్గడం, దీనికితోడు బలహీన మైన వర్షభావ పరిస్థితులు ఏర్పడడంతో వ్యవసాయో త్పత్తులు, ఉత్పాదకతపై ప్రభావం చూపింది. సంస్కరణల పేరుతో అంతకు ముందు దేశంలో ఉన్న వ్యవసాయ పరిశోధనలను తగ్గించివేసి కార్పోరేట్‌ సంస్థల నుండి వ్యవసాయ పరిశోధన ఫలితాలను దిగుమతులు చేసుకుంటున్నాం. నేడు దేశంలో మ్యాన్‌శాంటో, బేయర్‌, డూపాయింట్‌, కార్గిల్‌, సిన్‌ జెంట కంపెనీలు విత్తన రంగంపై 80 శాతం హక్కును సాధించాయి. దేశీయ పరిశో ధనలు పూర్తిగా తగ్గిపోయాయి. హరిత విప్లవ కాలంలో 36 డిగ్రీల వేడి ఉన్నప్పుడు ఉత్పత్తి చేసిన విత్తనాలు నేడు 46 డిగ్రీల వేడి వాతావరణంలో ఉత్పాదకత తగ్గిపోతున్నది. అందువల్ల అనివార్యంగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తున్నది.
ప్రపంచంలో 43 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణంతో దేశం మొదటి స్థానంలో ఉండగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 33 కోట్ల టన్నులతో మూడోస్థానంలో ఉన్నాం. సాగు విస్తీర్ణం 33 కోట్ల ఎకరాలతో 3వ స్థానంలో ఉన్న చైనా 80 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తూ మొదటి స్థానంలో ఉంది. 36 కోట్ల ఎకరాలతో రెండోస్థానంలో ఉన్న అమెరికా 60 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో 3వ స్థానంలో ఉంది. ఇప్పటికీ చైనా 120 దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేస్తున్నది. కానీ, మన దేశానికి అమెరికా నుండి సోయా ఉత్పత్తి దిగుమతులు వస్తున్నాయి.
దేశం పప్పు ధాన్యాల దిగుమతిని 2023లో 44 శాతానికి మించింది. 2.7 బిలియన్‌ డాలర్ల విలువగల పప్పులు దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో మసూర్‌ 1.3 బిలియన్‌ డాలర్లు, కందిపప్పు 766 మిలియన్‌ డాలర్లు, పెసర్లు 536 మిలియన్‌ డాలర్లు, కిడ్ని బిమ్స్‌ 120 మిలియన్‌ డాలర్లు మరియు కాబోలు శనగలు 76 మిలియన్‌ డాలర్లు దిగుమతి చేసుకుంటున్నాం. 31 మార్చి 2024 నాటికి 46.50 లక్షల టన్నుల పప్పులు దిగుమతి చేసుకుం టున్నాం.
చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ 17,35,286 టన్నులు దిగుమతి చేసుకున్నాం. మాంసం, పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ వాటిని కూడా దిగుమతులు చేసుకుంటున్నాం. పండ్లు, కూరగాయలు 50 వేల కోట్ల విలువగల పంటలు దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో 9 కోట్ల ఎకరాలు ప్రభుత్వ విధానాల ఫలితంగా బీళ్లుగా మారాయి. 6.35 కోట్ల ఎకరాల్లో హర్టికల్చర్‌ పంటలను రెట్టింపు చేయడానికి తగ్గిన విధానాల రూపకల్పన లేదు. అత్యంత చిన్న దేశాలైన ఇండోనేషియా, ప్రపంచంలో వంట నూనెల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని పాం ఆయిల్‌ తోటల్లో 90 శాతం చెట్లు ఇండోనేషియా, మలేషియాలోనే ఉన్నాయి. ఫిలిఫైన్స్‌, నైజిరియా, రష్యా, చైనా లాంటి దేశాలలో మిగులు ఉత్పత్తులు సాగించి ఎగుమతులు చేస్తున్నారు. నైజిరియా నుండి కో-కో బీన్స్‌ 3,44,644 టన్నులు ఏటా ఎగుమతులు జరుగుతున్నాయి.
రాయితీల కోత
2015 నుండి బీజేపీ ప్రభుత్వం శాంతకుమార్‌ కమిషన్‌ సూచనలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థలను ఎత్తి వేయ డానికి ఇచ్చిన సలహాలను పాటిస్తున్నది. ఎరువుల సబ్సిడీని తగ్గించి వేశారు. గత సంవత్సరం రూ2.28 లక్షల కోట్లు ఉండగా, 2024-25 సంవత్సరానికి రూ1.79 లక్షల కోట్లకు తగ్గించారు. వ్యవసాయ రుణాలను బ్యాంకు డిపాజిట్‌ లలో 40 శాతం ఇవ్వాలని ఆర్‌బిఐ ఆదేశాలు ఉన్నప్పటికీ 20 శాతం కూడా బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. ఇందులో పంట రుణాలు 18 శాతం ఇవ్వాలి. కానీ, 11 శాతం మాత్రమే ఇస్తున్నారు. పంటల బీమా, మద్దతు ధరల నిర్ణయం, మార్కెట్‌లలో మద్దతు ధరల అమలు, రుణాల వడ్డీ తగ్గింపు, తదితర అంశాలలో అమెరికా, చైనాతో పోల్చినప్పుడు మన దేశంలో 35 శాతానికి మించి ఇవ్వడం లేదు. 4 శాతం పంట రుణాల వడ్డీమాఫీ పథకానికి కేటాయించిన రూ.19,500 కోట్లలో ధనిక రైతులకే 60 శాతం వెళ్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏటా 13 రాష్ట్రాలలో 10 కోట్ల ఎకరాల పంటలకు నష్టం వాటిల్లిన కేంద్రం నుండి ఎలాంటి పరిహారం లేదు. 15వ ఆర్థిక సంఘం (2021-26) ప్రకృతి వైపరీత్యాల పరిహారం కింద రూ.1,22,601 కోట్లు కేటాయించగా అందులో రాష్ట్రాలు రూ.37,557 కోట్లు మ్యాచింగ్‌ గ్రాంట్‌ చెల్లించాలి. వాస్తవంగా జరుగుతున్న నష్టం ఇంతకు మూడింతలు ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ క్రమంగా వ్యవసాయ బడ్జెట్‌ను తగ్గిస్తూ వస్తున్నది. 2024-25 సంవత్సరానికి రూ1.17 లక్షల కోట్లు మాత్రమే కేటాయించింది. ప్రధాని మోడీ రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తానన్న వాగ్దానం అమలు కాలేదు. వీటన్నింటి ఫలితంగా పెట్టిన పెట్టుబడిరాక ప్రపంచంలోని ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో ఏటా 13 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ మరో ఆదాయ ఆధారం లేక వ్యవసాయాన్ని అంట్టిపెట్టుకొని ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయంలో యాంత్రీకరణ తెచ్చి మానవ శ్రమను తగ్గించి వేశారు. అందరికీ విద్య, నైపుణ్యత కల్పించి పారిశ్రామిక సేవా రంగాలలో ఉద్యోగాలు కల్పించారు. మన దేశంలో ఇప్పటికీ 53 శాతం మంది ఆధారపడి ఉండడానికి నిరక్ష్యరాస్యతే కారణం. అమెరికాలో 1.2 శాతం, ఇంగ్లాండ్‌లో 0.2 శాతం మాత్రమే వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అయినప్పటికీ ఈ దేశాలలో వ్యవసాయ బడ్జెట్‌ 7-8 శాతం కేటాయిస్తున్నారు. మన దేశంలో 3.4 శాతానికి ఎన్నడూ మించలేదు. పైగా, 14.57 కోట్ల మంది రైతులున్న వ్యవసాయరంగానికి ప్రత్యామ్నాయం చూపకుండా వీరిని తొలగించి కార్పోరేట్‌ సంస్థలకు వ్యవసాయం, మార్కెట్‌, ఎరువులు, హస్తగతం చేయడానికి దశాబ్దా కాలంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రైతుల సుదీర్ఘ పోరాటం వల్ల వారి చట్టాలను బహిరంగంగా ఉపసంహరించు కున్నప్పటికీ అంతర్లీనంగా ఆ విధానాలను అమలు చేస్తూనే ఉన్నారు.
నేడు వ్యవసాయరంగంలో భారత దేశం అతి చిన్న దేశాల స్థాయిలో కూడా నిలబడలేకపోతున్నది. స్విట్జర్‌లాండ్‌ లాంటి దేశాల నుండి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నారు. దిగు మతుల వల్ల ఏటా రూ.5 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం వృద్దా అవుతున్నది. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి వ్యవసాయ ప్రణాళికలు లేవు. రైతుల ఇష్ట-ఇష్టాలపై ఆధారపడి వ్యవసాయం సాగుతున్నది. ప్రతి దేశంలో వ్యవసాయ ప్రణాళికను అమలు చేయడం ద్వారా అక్కడ అభివృద్ధి సాధ్యమవుతున్నది. ప్రస్తుత విధానాలు మరికొంత కాలం కొనసాగితే దేశంలో ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి కూడా దెబ్బతిని, చివరికి అన్ని ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడాల్సిన ప్రమాదం వస్తున్నది.
దేశ మౌలిక వసతులను సద్వినియోగం చేయడం ద్వారా చైనా తరహాలో అనేక దేశాలకు మన వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాన్ని పెంచుకోవడానికి వ్యవసాయ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి. వ్యవసాయానికి పరిశ్రమలను, సేవా రంగాన్ని అనుబంధం చేయడం ద్వారా ఉత్పత్తులు పెంచాలి. రైతులందరికీ విద్య, నైపుణ్యం కల్పించి వారి ఆదాయాన్ని పెంచే ఏర్పాటు చేయాలి. ఇది సాధించాలంటే రైతులు ఐక్య పోరాటాలు చేయడం తప్ప మరో మార్గం లేదు.
సారంపల్లి మల్లారెడ్డి
9490098666