దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది మోడీ హయాంలో అన్ని రంగాల్లో సంక్షోభం

– రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతదేశం అత్యంత క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కొం టున్నదనీ, ప్రధాని నరేంద్రమోడీ హయాంలో అన్ని రంగాల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ అన్నారు. స్వాతంత్య్రోద్యమంతో సంబంధం లేనివారు, ఇప్పుడు దేశభక్తులుగా ప్రచారం పొందుతున్నారనీ, ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందని ప్రశ్నించారు. ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ఇండియా (మెఫీ) ఆధ్వర్యంలో శనివారంనాడిక్కడి ప్రెస్‌క్లబ్‌లో ‘సంక్షోభంలో మన గణతంత్రం – విశ్లేషణ’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం 23 శాతం పెరిగినా కేంద్రంలోని ప్రభుత్వం తనకు ఏమాత్రం సంబంధం లేదన్నట్టే వ్యవహరిస్తున్నదని ఆక్షేపించారు.
యువతరం కూడా తమ హక్కులు, ఉపాధి, భవిష్యత్‌ గురించి ఆలోచించకుండా ‘హిందుత్వ’ పేరుతో మతం చుట్టూ తిరగడం అత్యంత ప్రమాదకర పరిణామమని విశ్లేషించారు. మతం అనేది స్లో పాయిజన్‌లాగా ప్రజల్లోకి ఎక్కించబడిందనీ, దీనికి విరుగుడును రాజకీయపార్టీలు సాధించలేవని అభిప్రాయపడ్డారు. పౌరసమాజం, జర్నలిస్టులు, విశ్వవిద్యాలయాలు, మేథావులు, అభ్యుదయవాదులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వల్లే ఈ మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోలేదనీ, దాని ఓట్‌బ్యాంక్‌ ఇప్పటికీ అంతే పటిష్టంగా ఉన్నదని ఉదహరించారు. ప్రజల్లోని మతం అనే భావజాలాన్ని నిర్మూలించే ప్రయత్నం జరక్కపోతే, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిరుద్యోగం, ధరల పెరుగుదల ఇప్పుడే అధికంగా ఉన్నదని చెప్పారు. ఇప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ 2019 నాటికే చేరుకోలేక పోతున్నదనీ, అయినా దేశ ప్రధాని ఇది తనకు సంబంధించిన విషయం కాదన్నట్టే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థవల్ల దేశంలో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు… ఎంతమంది వలస కార్మికులు చనిపోయారనే లెక్కలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయా అని ప్రశ్నించారు. దేశంలో 25శాతం జనాభా పౌష్టికాహారం లేక బలహీనమైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో చైనా చొరబడినా, శవాలు గంగా నదిలో తేలినా, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా, నిరుద్యోగం తాండవిల్లుతున్నా… ఇవేమీ పట్టించుకోకుండా మతం మత్తులో తూగుతున్నామనీ, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ప్రమాదకర భావజాలం పెరిగిపోతున్నదని హెచ్చరించారు. భారతదేశాన్ని ఇంకో పాకిస్థాన్‌ చేయాలంటే… గాంధీ, నెహ్రూ, పటేల్‌కు రెండు నిమిషాలు పట్టేదికాదనీ, వారు కోరుకున్న భారతదేశం ఇది కాదని స్పష్టం చేశారు. కార్యక్రమానికి ‘మెఫీ’ చైర్మెన్‌ కే శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించగా, మేనేజింగ్‌ ట్రస్టీ దేవులపల్లి అమర్‌ వందన సమర్పణ చేశారు.