– పార్లమెంటు ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలి
– బీజేపీతో సమైక్యతకు ప్రమాదం
– అప్పుడే ఫెడరలిజం పరిఢవిల్లుతుంది
– కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని ఖూనీ చేయడమే విజయ చిహ్నాలా?
– కేంద్రం నిర్ణయాలతో ఈసీ స్వయంప్రతిపత్తి నాశనం
– నియంతృత్వ, అధ్యక్ష పాలన కోసమే ఒకే దేశం ఒకే ఎన్నికలు
– పహిల్వాన్లుగా వ్యవహరిస్తున్న గవర్నర్లు
– కులవ్యవస్థను కాపాడేదే సనాతన ధర్మం
– వైరుధ్యాలున్నా విపక్షాలు సహకరించుకుని బీజేపీని గద్దెదించాలి
– కేంద్రం అన్యాయంపై రేవంత్ సర్కారు శ్వేతపత్రం ప్రకటించాలి
– ఎన్నికల బాండ్లను తీసుకోని జాతీయ పార్టీ సీపీఐ(ఎం) మాత్రమే : రాష్ట్ర విస్తృత సమావేశంలో బివి రాఘవులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీజేపీ అధికారంలో ఉంటే దేశ సమైక్యతకే ప్రమాదకరమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ఫెడరలిజం లేకుండా దేశం ఐక్యంగా ఉండబోదన్నారు. దేశాన్ని సమైక్యంగా ఉంచాలంటే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గద్దెదించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశానికి కమ్యూనిస్టులు ఎంతో అవసరమని చెప్పారు. రెండురోజులపాటు జరగనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర విస్తృత సమావేశం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ప్రారంభమైంది. ఆ పార్టీ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి సుదర్శన్, టి జ్యోతి, ఎండీ అబ్బాస్ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. జ్యోతి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సభలో రాఘవులు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన కర్తవ్యమని చెప్పారు. మూడోసారి అధికారంలోకి వస్తామంటూ ఉవ్విళ్లూరు తున్న బీజేపీని నిరోధించాలని అన్నారు. సొంతంగా 370 ఎంపీలు స్థానాలు మిత్రపక్షాలతో కలిసి 400 స్థానాలు గెలుస్తామంటున్నదని వివరించారు. జమ్మూకాశీక్మర్‌ను విచ్ఛిన్నం చేస్తూ 370 అధికరణాన్ని కేంద్రం రద్దు చేసిందన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో 370 సీట్లు లక్ష్యంగా నిర్దేశించుకుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని ఖూనీ చేసి, ఫెడరల్ వ్యవస్థను నాశనం చేసి, సామాజిక న్యాయానికి తూట్లు పొడిచి విదేశీ వ్యవహారాలను తాకట్టు పెట్టడమే విజయ చిహ్నాలా?అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, దాని విలువలను ధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. 146 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి 19 బిల్లులను పార్లమెంటు ఆమోదించిందని వివరించారు. అందులో ప్రజల ప్రాథమిక హక్కులు హరించే అంశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందన్నారు. వాస్తవాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే వారి నోరు నొక్కేస్తున్నారనీ, జైళ్లలో నిర్బంధిస్తున్నారని చెప్పారు. న్యూస్‌క్లిక్ చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థను అరెస్టు చేయడమే అందుకు నిదర్శనమని అన్నారు. మేధావులు జైళ్లలో మగ్గుతున్నారని చెప్పారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) స్వయం ప్రతిపత్తిని నాశనం చేసిందని విమర్శించారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు తేవాలని భావిస్తున్నదని అన్నారు. దాంతో భిన్న భాషలు, మతాలు, సంస్కృతులు, ఆహారపు అలవాట్లు ఇవేవీ ఉండబోవని చెప్పారు. వార్డు నుంచి పార్లమెంటు వరకు ఒకే సారి ఎన్నికలు జరిగితే స్థానిక రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోబోరని అన్నారు. ఇది నిరంకుశ, నియంతృత్వ, అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉండబోదని చెప్పారు. సమాఖ్య వ్యవస్థ ఉంటేనే రాష్ట్రాలకు హక్కులుంటాయని వివరించారు. అప్పుడే దేశం సమైక్యంగా ఉంటుందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు అమలైతే అధ్యక్ష తరహా పాలనకు ఆపైన ఏకవ్యక్తి పాలనకు దారితీస్తుందని అన్నారు.
ఎన్నికల బాండ్లు ప్రజాస్వామ్యానికి హానికరం
కార్పొరేట్ శక్తులు ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించే పరిస్థితి వచ్చిందని రాఘవులు చెప్పారు. ఎన్నికల బాండ్లు ప్రజాస్వామ్యానికి హానికరమని విమర్శించారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఆ బాండ్ల వల్ల బీజేపీ లాభపడిందని చెప్పారు. ఇది ఎన్నికలను డబ్బుమయం చేస్తుందన్నారు. నల్లడబ్బును, హవాలా డబ్బును తెల్లడబ్బుగా మారుస్తుందని అన్నారు. ఎన్నికలను విదేశీ సంస్థలు నిర్ణయించే పరిస్థితి వస్తుందన్నారు. ఇంకోవైపు డబ్బులిచ్చిన సంస్థలు, అధికార పార్టీకి మధ్య కిడ్ ప్రోకో (నీకది నాకిది) జరుగు తుందని చెప్పారు. ఎన్నికల బాండ్లు తీసుకోని ఏకైక జాతీయ పార్టీ సీపీఐ(ఎం) అని అన్నారు. పన్ను బకాయిలు చెల్లించకుండా రాష్ట్రాలను మున్సిపాల్టీల స్థాయికి కేంద్రం దిగజార్చిందని విమర్శించారు. జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రాలకు వాటా ఉంటుందనీ, సర్‌చార్జీలు, సెస్సులు వసూలు చేస్తే మొత్తం కేంద్రానికే చెందుతాయని చెప్పారు. సర్‌చార్జీలు, సెస్సులను కేంద్రం 10 శాతం నుంచి 18 శాతానికి పెంచిందన్నారు. అందులో రాష్ట్రాలకు వాటా లేదని అన్నారు. ఇంకోవైపు బడ్జెట్‌లో మూడు శాతానికి మించి రాష్ట్రాలు అప్పులు తీసుకునే అవకాశం లేదన్నారు. కానీ కేంద్రం ఆరు శాతం అప్పులు చేస్తున్నదని వివరించారు. గవర్నర్లు పహిల్వాన్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఢిల్లీలో ఇదే పరిస్థితి ఉందన్నారు.
ఆర్థిక స్వావలంబనను దెబ్బతీస్తున్న బీజేపీ
మతంతో రాజకీయాలకు సంబంధం ఉన్న దేశాలేవీ అభివృద్ధిలో ముందుకుపోలేదని చెప్పారు. రామమందిరం ప్రారంభోత్సవం ప్రభుత్వ కార్యక్రమంగా మోడీ చేశారని అన్నారు. సర్వమత సమభావం అంటున్న బీజేపీ ఇతర మతాల కార్యక్రమాలనూ ఇలాగే చేస్తుందా?అని ప్రశ్నించారు. దేశంలో సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాలన్నారు. దళితులు, గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కులవ్యవస్థను కాపాడేది సనాతన ధర్మమని అన్నారు. కుల వ్యవస్థ ఉంటే దేశం ముందుకుపోదని చెప్పారు. కులవ్యవస్థను, పితృస్వామిక వ్యవస్థను కాపాడేందుకే సనాతన ధర్మం ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థిక స్వావలంబనను దెబ్బతీ స్తున్నదని విమర్శించారు. అమెరికా నుంచి కోడికాళ్లను (లెగ్‌పీస్)ను, బాతుమాంసాన్ని దిగుమతి చేసుకుంటున్నదని వివరించారు. వాటిపై దిగుమతి పన్నును 30 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించిందని అన్నారు. దీంతో దేశంలోని కోళ్ల పరిశ్రమలు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇది మేకిన్ ఇండియా కాదనీ, మేడిన్ అమెరికా అని ఎద్దేవా చేశారు. మద్దతు ధరలకు చట్టం చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పారు. వడ్లు, గోధుమలకే ఇస్తామని కేంద్రం చెప్తున్నదని వివరించారు. 23 పంటలకు ఇవ్వాలని రైతులంటున్నారని అన్నారు. ఆందోళన చేసే రైతులపై నిర్బంధాన్ని ప్రయోగి స్తున్నదని చెప్పారు. పంటలకు ఎంఎస్‌పీ ప్రకటిస్తే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం సాధ్యం కాదన్నారు. అందుకే ప్రజలు, రైతుల జీవన పరిస్థితులు మెరుగుపడాలన్నా బీజేపీ ఓడిపోవాలని అన్నారు. అందుకే విశాల శక్తులను కూడగట్టేందుకు ఇండియా కూటమి ఏర్పడిందని చెప్పారు. విపక్ష పార్టీల మధ్య వైరుధ్యాలున్నా బీజేపీ ఓటమికి సహకరించుకోవాలన్నారు. ఈ నిర్ణయం అధికార పార్టీకి వణుకు పుట్టిస్తున్నదని అన్నారు. అందుకే బీహార్‌లో నితీశ్‌కు ఎర వేసిందనీ, ఏపీలో టీడీపీ-జనసేన, తెలంగాణలో బీఆర్‌ఎస్‌లకు వల వేస్తోందని చెప్పారు. అయితే బీజేపీ హిందూత్వ సిద్ధాంతాన్ని సాఫ్ట్ హిందూత్వతో ఓడించగలమని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. హిందూత్వ సిద్ధాంతాన్ని లౌకికసిద్ధాంతం ద్వారానే ఓడించడం సాధ్యమవుతుందని అన్నారు.
బీజేపీపై రేవంత్‌రెడ్డి పోరాడాలి
తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలుస్తామని కిషన్‌రెడ్డి అంటున్నారని రాఘవులు చెప్పారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓట్లేస్తే మూసీనదిలో వేసినట్టేనని ఆయన అంటున్నారనీ, కిషన్‌రెడ్డే మూసీలో పడిపోతావు జాగ్రత్త అని అన్నారు. రాష్ట్ర ఖజానాను బీఆర్‌ఎస్ ఖాళీ చేసిందంటూ కాంగ్రెస్ విమర్శిస్తున్నదని చెప్పారు. తెలంగాణకు కేంద్రం చేసిన అన్యాయంపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కర్నాటక ప్రభుత్వ తరహాలో బీజేపీకి వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి పోరాడాలని కోరారు. బీజేపీని ఒంటరిని చేయడానికి బీఆర్‌ఎస్ ముందుకొస్తుందా? ఆ పార్టీకి దాసోహమవుతుందా? భవిష్యత్తులో తెలుస్తుం దన్నారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు వచ్చాయనీ, అవి సమన్లా లేక గాలమా కొద్దిరోజుల్లో స్పష్టమవుతుందని చెప్పారు. రాజకీయాలు ఎలా ఉన్న ప్రజాసమస్యలను వదిలిపెట్టొద్దని సూచించారు.
ఎన్నికలూ పోరాట సాధనాలే :తమ్మినేని
రాష్ట్రంలో రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అయితే పొత్తు ఉంటుందా? లేదా? అన్నది కాంగ్రెస్ తేల్చాలని చెప్పారు. ఆ పార్టీతో కలిసి వెళ్లేందుకు అవకాశాలున్నాయని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానే రాజకీయ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవకాశముంటుందన్నారు. బీఆర్‌ఎస్‌ను అహంకారం, అప్రజాస్వామిక విధానాలను చూసి ప్రజలు ఓడించారని వివరించారు. కాంగ్రెస్ విజయాన్ని స్వాగతించామని చెప్పారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య పరిమితిని రూ.పది లక్షలకు పెంచడాన్ని హర్షించామని వివరించారు.బీఆర్‌ఎస్ అవినీతిని కక్కించాల్సిందేనని అన్నారు. ఖజానా ఖాళీ అయినా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని వివరించారు. రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నడకను బట్టి ఈ రాష్ట్రంలో సీపీఐ(ఎం) పాత్ర ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, చుక్క రాములు, జూలకంటి రంగారెడ్డి, డిజి నరసింహారావు, జాన్‌వెస్లీ, పాలడుగు భాస్కర్, టి సాగర్, మల్లు లక్ష్మి, పి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.