దేశానికి కామ్రేడ్స్‌ కావాలి…

”నీ హక్కు కోసం నువ్వు పోరాడాలి. దాన్ని నువ్వు ధైర్యంగా అడగాలి. దానికోసం ఏ కష్టాన్నైనా ఎదిరించాలి. దాన్ని సాధించడం కోసం నువ్వు చేసే ప్రయాణంలో నీకు తోడొచ్చే వాడే కామ్రేడ్‌!” అంటూ ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో హీరో తాతయ్య వివరిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్‌ ఒక క్రికెట్‌ క్రీడాకారిణి. క్రికెట్‌ బోర్డుకు చెందిన అధికారి తనను లైంగికంగా వేధిస్తున్నప్పుడు ప్రతిఘటించిన ఆమెను, ఆమె స్నేహితురాలిని అకాడమీ నుండి బయటకు వెళ్లేలా చేస్తాడు. తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌కు దూరమై, ఇంత చేసిన అతన్ని ఏమీ అనలేక, బయటకు తెలిస్తే తమ పరువు పోతుందనుకునే తల్లిదండ్రుల నీడన ఉన్న ఆమె డిప్రెషన్‌లోకి వెళుతుంది. తనని అవమానించిన, మానసికంగా హింసించిన, తన భవిష్యత్తునే కాలదన్న చూసిన వాడి నిజస్వరూపం బయటపెట్టిన తర్వాతే ఆమె డిప్రెషన్‌ నుంచి నిజంగా బయటకొస్తుంది. దీనికి తన వెంట ఉండి నిలబడినవాడే సినిమాలో హీరో కామ్రేడ్‌.
ఇలాంటి పోలిక ఉన్న కథే నేడు దేశ రాజధానిలో నిజ జీవితంలో జరుగుతున్నది. దేశానికి అంతర్జాతీయ ఖ్యాతిని, అవార్డులను తెచ్చిన మహిళా రెజ్లర్లను… ‘భారత కుస్తీ సమాఖ్య’ (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు వారు ఆరోపణ చేశారు. వేధింపులు చేసిన వారిపై కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయకపోవడం, దానికోసం నెలల తరబడి రోడ్లపై నిరసన తెలపాల్సి రావటం, స్వయంగా ప్రధానితో చెప్పినా పట్టించుకోకపోవడం, బాధితులను బెదిరింపులకు గురిచేయడం, సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన తర్వాత గానీ నామమాత్రంగా కేసు నమోదు చేయడం, దీనిపై వేసిన కమిటీ పారదర్శకతలేని విచారణ జరిపి నిందితునికి క్లీన్‌చిట్‌ ఇచ్చేయడం అన్నది మహిళల ప్రాథమిక హక్కులను కాలరాయడం కన్నా మించినదని ఇట్టే అర్థమైపోతుంది. అధికారంలో ఉన్న మహిళా రాజకీయ ప్రతినిధులు కళ్లకు గంతలు కట్టుకున్నట్లు నటించడం, కనీసం స్పందించకుండా పరుగులు తీయడం (కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి), క్రీడారంగంలోనే ఉన్న మహిళలు సైతం నిరసన తెలుపుతున్న వారిని తప్పుపట్టడం, ఇంకా తుప్పుపట్టి ఉన్న వ్యవస్థను ప్రతిబింబింపజేస్తుంది.
నిర్భయ ఘోరం జరిగినప్పుడు ఆ సమయంలో ఆమె ఎందుకు బయటకు వెళ్లాలి అనీ, బన్వారీ దేవి (రాజస్థాన్‌) కేసులో ఎవరికో బాల్య వివాహం చేస్తుంటే ఆమెకేంటని, రెజ్లర్ల విషయంలో అసలు ఆడపిల్లలకు ఇలాంటి ఆటలు ఎందుకని మాట్లాడే వ్యవస్థను పాలకులు ఇంకా ఇంకా కొనసాగించాలనే ఈ రోజు పాలక పార్టీకి చెందిన ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను తప్పు చేశాడని తెలిసి కూడా వెనకేసుకొస్తోంది. బన్వారీ దేవి కేసులో మొట్ట మొదటిసారిగా… పని ప్రదేశంలో మహిళల భద్రత అనేది వారి ప్రాథమిక హక్కు అని పేర్కొంటూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. ఆర్టికల్‌ 14, 15, 19, 21 ప్రకారం లైంగికంగా వేధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుంది. కానీ రాజ్యాంగ హక్కు కాదు కదా! కనీసం నైతిక విలువలు కానీ మానవీయ కోణం కూడా లేని దృశ్యాలు దేశంలో చోటు చేసుకుంటున్నాయి. కొందరు బలైన తర్వాతే చట్టాలు వచ్చాయి. కానీ ఈ చట్టాల అమలు కోసం మరలా పోరాటం చేయ వలసి వస్తున్నది. ఈ పోరాటంలో అనేకమంది తమ జీవితాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. గుజరాత్‌ అల్లర్లలో బిల్కిస్‌ బానో కేసులో ఆమె సంవత్సరాల తరబడి పోరాడిన తర్వాత దోషులకు శిక్షపడింది. అయితే ఆ తర్వాత సంస్కారవంతులనే సర్టిఫికెట్‌తో అంత ఘోరం చేసినవారు బయటకు రావడం… హారతులు ఇవ్వడం చూశాం. సినిమాలో చివరకు కథ సుఖాంతం అవుతుంది. కానీ నిజ జీవితంలో ఇది నిజంగా సాధ్యమా? ఆ అధికారి వెనుక ఒక రాజకీయ పార్టీ ఉంటే? ఆ అధికారి వెనుక ధనస్వామ్యం ఉంటే? అధికారి వెనుక ఏకంగా అధికార పార్టీ అండదండ ఉంటే… బాధితురాలికీ, ఆమె కుటుంబానికీ పాట్లు తప్పవని ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో దారుణ అత్యాచార ఉదంతం తెలియచేస్తోంది. ఇటువంటి అనేక ఇబ్బందులను ఢిల్లీలో రెజ్లర్లు పడుతున్నారు. అయినా కానీ వారి పోరాట స్ఫూర్తి తగ్గలేదు. మే 28న ఒకపక్క పార్లమెంటు భవన ప్రారంభోత్సవం జరుగుతుంటే మరో పక్క పోలీస్‌ రాజ్యం యథేచ్ఛగా సాగిపోయింది. నూతన పార్లమెంటు భవనానికి మార్చ్‌గా వెళుతున్న రెజ్లర్లపై పోలీసులు పైశాచికంగా దాడిచేశారు. నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్‌ వాహనంలో ఎత్తిపడేశారు. పోలీస్‌స్టేషన్ల చుట్టూతిప్పారు. సోషల్‌ మీడియాలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా రెజ్లర్లకు వ్యతిరేకంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నెట్‌వర్క్‌ విషప్రచారం సాగించింది. దీంతో తాము గెలిచిన పతాకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు రెజ్లర్లు.
దేశవ్యాప్తంగా రైతు, వ్యావసాయ కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల మద్దతును రెజ్లర్లు కూడగట్టుకోవడంతో ఈ పోరాటం ప్రజా పోరాటంగా రూపాంతరం చెందింది. ఇది కేవలం మల్ల యోధుల పోరాటం మాత్రమే కాదు. ప్రజాస్వామ్యానికి, ధనస్వామ్యానికి జరుగుతున్న పోరాటం. ఈ పోరాటానికి… స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్‌ వారి ముందు రొమ్ము విరుచుకుని నిలబడిన కామ్రేడ్లు కావాలి. ఎన్‌ఆర్‌సి లాంటి కుట్ర పూరితమైన పౌర సత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన కామ్రేడ్లు కావాలి. రైతు ఉద్యమంలో దేశ ప్రధాని మెడలు వంచిన కామ్రేడ్లు కావాలి. ఇటువంటి కామ్రేడ్స్‌ లేకుండా ప్రపంచంలో ఏ హక్కు సాధించలేదు. అందుకే రెజ్లర్లకు న్యాయం జరిగే వరకూ, మహిళలను లైంగిక వస్తువుగా చూసే నీచులకు బుద్ధి చెప్పే వరకు ఈ పోరాటం సాగాలి.
ఎండీ. షకీలాబేగమ్‌