మహిళాభ్యున్నతితోనే దేశ ప్రగతి

– మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అన్నిరంగాల్లో మహిళలు అభ్యున్నతి సాధిస్తేనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఎలక్ట్రిసిటి ఉమెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సమాజంలో మహిళల పాత్ర చాలా గొప్పదనీ, ప్రతి వ్యక్తి వారిపట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని చెప్పారు. అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ అమలు చేసిన రిజర్వేషన్ల వల్లే మహిళలు రాజకీయంగా ఎదిగే అవకాశాలు దక్కాయని వివరించారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చట్టసభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ, మహిళా సాధికారతను ఆచరణలో చూపిస్తామన్నారు.