– పటేల్‌తో దేశ సార్వభౌమత్వానికి నిండుతనం : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, 20 సూత్రాల కార్యక్రమం లాంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతికి, పేదల అభ్యున్నతికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆమె వర్థంతిని పురస్కరించుకుని సేవలను స్మరించుకున్నారు. బుధవారం ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తన ప్రతి రక్తపు బొట్టు కూడా దేశ పటిష్టతకు తోడ్పడుతుందని ప్రకటించిన మహనీయురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసినప్పటికీ దేశ సమగ్రత, సమైకత్య, పటిష్టత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుని ఆమె ముందుకు సాగారని తెలిపారు. తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ పాలనను ఆదర్శంగా తీసుకుందనీ, ఆ మహనీయురాలి స్ఫూర్తితోనే పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని చేపడుతున్నామని సీఎం పేర్కొన్నారు.
సంస్థానాల విలీనం ద్వారా స్వాతంత్య్ర భారతదేశ సార్వభౌమత్వానికి నిండుదనాన్ని చేకూర్చిన మహనీయుడు సర్దార్ వల్లభారు పటేల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను సీఎం స్మరించుకున్నారు. స్వాతంత్య్ర భారత ప్రథమ ఉప ప్రధానమంత్రిగా, హౌం శాఖ మంత్రిగా ఆయన చూపిన చొరవ, సమర్ధతతోనే వందలాది సంస్థానాలు దేశంలో విలీనమయ్యాయని గుర్తుచేశారు. సర్దార్ పటేల్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.