జీనోమ్‌ వ్యాలీ ఏర్పాటు మా విజన్‌లో భాగం

The creation of Genome Valley is part of our vision– మున్సిపల్‌, పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌
– యూరోఫిన్స్‌ అత్యాధునిక బయోఫార్మా సర్వీసెస్‌ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి
– మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతుండగా ఎమర్జెన్సీ అలర్ట్‌
దేశవ్యాప్తంగా గురువారం అన్ని మొబైల్‌ ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్‌ మోగింది. విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎన్డీఎంఏ రూపొందించిన వ్యవస్థను పరీక్షించే క్రమంలో దేశవ్యాప్తంగా మొబైల్‌ ఫోన్లకు ఈ అలర్ట్‌ మెసేజ్‌ పంపారు. అయితే జీనోమ్‌ వ్యాలీలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతుండగా.. అక్కడ ఈ ఎమర్జెన్సీ అలర్ట్‌ వచ్చింది. అది గమనించిన కేటీఆర్‌ ‘ఏమైనా ఫైర్‌ అలారమా? వెళ్లిపోదామా?’ అని ప్రశ్నించారు. అయితే స్పీకర్‌లో సౌండ్‌ వస్తుందని అధికారులు చెప్పగా.. కేటీఆర్‌.. ‘ స్పీకరే కదా.. ఓకే.. ఇది క్లోజ్డ్‌ ఆడిటోరియం, అందరికీ గుడ్‌ లక్‌’ అంటూ చమత్కరిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఇది మొబైల్‌ ఫోన్‌లో వచ్చిన అలర్ట్‌ అన్నది తర్వాత తెలిసింది.
నవతెలంగాణ-శామీర్‌పేట
జీనోమ్‌ వ్యాలీని ఏర్పాటు చేయడం తమ విజన్‌లో భాగం అని మున్సిపల్‌, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. లైఫ్‌ సైన్సెస్‌, పరిశ్రమలకు టెస్టింగ్‌ సేవలను అందించడంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న యూరోఫిన్స్‌ అత్యాధునిక బయోఫార్మా సర్వీసెస్‌ క్యాంపస్‌ను మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం జీనోమ్‌ వ్యాలీలో గురువారం యూరోఫిన్‌ రీజినల్‌ డైరెక్టర్‌ నీరజ్‌ గార్గ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. జీనోమ్‌ వ్యాలీ శక్తివంతమైన ఆర్‌ అండ్‌ డీ పర్యావరణ వ్యవస్థకు మరొకటి జతకలిసినందుకు సంతోషిస్తున్నానని అన్నారు. యూరోఫిన్స్‌ వృద్ధి ప్రణాళికలో భాగంగా ఇక్కడ పెట్టుబడి పెడుతుందని చెప్పారు. ఈ క్యాంపస్‌ నుంచి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నానన్నారు. ప్రస్తుతం జీనోమ్‌ వ్యాలీలో ఫేజ్‌-3లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని తెలిపారు. ఇన్నోవేషన్‌ కోసం ‘గ్లోబల్‌ వ్యాలీ ఆఫ్‌ గ్రోత్‌’ను స్థాపించడం జరిగిందన్నారు. తమకు కేంద్ర ప్రభుత్వానికి పడదని.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య ఎప్పుడు ఏదో పంచాయితీ నడుస్తూనే ఉంటుందని చెప్పారు. అయినప్పటికీ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో నెంబర్‌వన్‌ ఎవరని అడిగితే తెలంగాణ అని వాళ్లు కూడా ఒప్పుకునే పరిస్థితిని సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చారన్నారు.
నీరజ్‌ గార్గ్‌ మాట్లాడుతూ.. యూరోఫిన్స్‌ హైదరాబాద్‌ బయోఫార్మా సర్వీసెస్‌ క్యాంపస్‌ భారత్‌లో రెండో క్యాంపస్‌ అని తెలిపారు. హైదరాబాద్‌ క్యాంపస్‌లో 15 ఎకరాల స్థలంలో దాదాపు లక్ష చదరపు అడుగులలో ప్రయోగశాల, కార్యాలయం ఉందన్నారు. జీనోమ్‌ వ్యాలీలోని క్యాంపస్‌ ప్రపంచ ఔషధ కంపెనీలకు డిస్కవరీ కెమిస్ట్రీ, డిస్కవరీ బయాలజీ, సేఫ్టీ టాక్సికాలజీ, బయో అనలిటికల్‌ సర్వీసెస్‌, ఫార్ములేషన్‌ డెవలప్‌మెంట్‌ సేవలను అందిస్తుందని చెప్పారు. భారత్‌లో యూరోఫిన్స్‌, యూరోఫిన్స్‌ అడ్వినస్‌ ద్వారా ఫార్మాస్యూటికల్‌, అగ్రోసైన్సెస్‌ కంపెనీలకు ఆర్‌అండ్‌డీ అవసరాల కోసం సేవలను అందించనుందని చెప్పారు. ఈ కొత్త స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌, బయోఫార్మా సర్వీసెస్‌ క్యాంపస్‌ భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి యూరోఫిన్స్‌ నిబద్ధతకు తార్కాణం అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో తమకు ఉన్న సహకారం విశేషంగా ఆకట్టుకుందన్నారు.
యూరోఫిన్స్‌ అడ్వినస్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. భారత్‌లో యూరోఫిన్‌లకు షోకేస్‌ సైట్‌గా హైదరాబాద్‌ క్యాంపస్‌ విస్తరించడం జరుగుతుందన్నారు. డిస్కవరీ నుంచి డెవలప్‌మెంట్‌ వరకు జీఎంపీ టెస్టింగ్‌ వరకు పూర్తి ఫార్మా ఆర్‌అండ్‌డీ వాల్యూ చైన్‌లో చిన్న మాలిక్యూల్స్‌, రెండింటికి సంబంధించిన సేవలను కలిగి ఉంటుందన్నారు. ఆసియాలో డ్రగ్‌ డిస్కవరీ, డెవలప్‌మెంట్‌ సేవలకు హైదరాబాద్‌ కేంద్రబిందువు అన్నారు. జీనోమ్‌ వ్యాలీ గ్లోబల్‌, ఇండియన్‌ ఫార్మాస్యూటికల్స్‌లో ఇండిస్టీ లీడర్ల కోసం పనిచేస్తున్న దాదాపు 25 వేల మంది నిపుణులతో కూడిన శాస్త్రీయ వర్క్‌ఫోర్స్‌తో 200 కంటే ఎక్కువ కంపెనీలకు నిలయంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్‌ ఇండిస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఈవీ నరసింహా రెడ్డి ఐఏఎస్‌, తెలంగాణ ప్రభుత్వ లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ ఫార్మా డైరెక్టర్‌ శక్తి ఎం.నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.