నవతెలంగాణ – భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్సీ వసతి గృహంలో ఇద్దరు బాలికలు ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఐద్వా ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టల్ ని సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘటన జరిగి ఆరు రోజులు అవుతున్న సంబంధిత అధికారులు ఎటువంటి కారణాలు స్పష్టంగా చెప్పానటువంటి పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో సీసీ కెమెరాలుగానీ , శుభ్రత గాని లేనటువంటి పరిస్థితి ఉందన్నారు. అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నటువంటి రూముని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను చూసినట్లయితే చాలా అనుమానాస్పదంగా ఉన్నదని అన్నారు. వార్డెన్ మేడం, పీఈటి మేడం, డ్రైవర్ ని, పంట మనిషిని వీరందరూ పైన పోలీసులు, శిశు సంక్షేమ శాఖ అధికారి, జిల్లా కలెక్టర్ నియమించిన ప్రత్యేక విచారణ అధికారి సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము పలు చర్యలు తీసుకోవాలన్నారు. పదవ తరగతి విద్యార్థులకు భరోసా కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, కోశాధికారి కల్లూరి నాగమణి, పట్టణ అధ్యక్షురాలు మాయ రాణి పాల్గొన్నారు.