విద్యార్థినీల మృతికి కారణమైన దోషులను వెంటనే అరెస్టు చేసి, శిక్షించాలి

– జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సైరా భాను
నవతెలంగాణ – భువనగిరి రూరల్
ఇద్దరు విద్యార్థుల మృతికి కారణమైన  నిందితులను వెంటనే అరెస్టు చేసి, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని, భవిష్యత్తులో ఎవరు ఇలాంటి సంఘటనలు పాల్పడకుండా కఠిన శిక్ష విధించాలని రాష్ట్ర మానవ హక్కుల జాతీయ అధ్యక్షురాలు  సైరా బాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని సాయికుమార్ కాలేజీలో గల ఎస్సీ హాస్టల్ ను పరిశీలించి,  మాట్లాడారు. ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని, లేనియెడల హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు. ఇద్దరు అమ్మాయిలు చనిపోయిన కూడా ప్రభుత్వం ఇంతవరకు కారకులైన వారిని ఎందుకు గుర్తించలేకపోయిందని, ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు, అనుమానితులు ఎవరైనా ఉంటే వారిని అరెస్టు చేసి, విచారణ చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయని అన్నారు. తక్షణమే ప్రభుత్వం కారకులైన వారిని అరెస్టు చేయాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ సంఘటనకు కారకులైన ప్రతి ఒక్కరిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పళ్ళ గొర్ల మోదీ రాందేవ్ యాదవ్ లు ఉన్నారు.