గుడిసెలను దహనం చేసిన నిందితులను శిక్షించాలి

The culprits who burnt the huts should be punished–  సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి
నవతెలంగాణ – హన్మకొండ
హన్మకొండ జిల్లా న్యూశాయంపేటలోని కందులబండ భూ పోరాట ప్రాంతంలో సర్వే నెంబర్‌ 579, 599లో ఏడాది కిందట వేసిన సమారు 175 గుడిసెలను శనివారం రాత్రి దహనం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి పోలీసులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని కోరారు. ఆదివారం న్యూ శాయంపేటలో దహనమైన గుడిసెల ప్రాంతాన్ని సీపీఐ(ఎం) బృందం సందర్శించి వారిని ఓదార్చారు. గుడిసెల్లో ఉన్న నిత్యావసర సరుకులు, వంట సామగ్రి తదితర సామాగ్రి తగలబడి సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లిందని గుడిసెవాసులు పార్టీ నాయకులకు తెలిపారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ.. కాజీపేట మండల రెవెన్యూ యంత్రాంగంతో మాట్లాడామని, ఈ సంఘటనపై పోలీసులు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏం.చుక్కయ్య మాట్లాడుతూ కందులబండ ప్రభుత్వ భూమిని ఎలాగైనా కాజేయాలని కొందరు భూకబ్జాదారులు ఈ భూమిపై కన్నేశారని ఆరోపించారు. పేదలను భయభ్రాంతులకు గురిచేసి వాళ్లను ఇక్కడి నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మండల రెవెన్యూ అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం కందుల బండ భూ పోరాటాన్ని రక్షించి, గుడిసెలు వేసుకున్న వారికి భూమిని పంచి ఇవ్వాలని, పట్టాలు అందజేయాలని కోరారు. సందర్శించిన వారిలో.. పార్టీ కాజీపేట మండల కమిటీ సభ్యులు ఓరుగంటి సాంబయ్య, జంపాల రమేష్‌, భూ పోరాట కమిటీ సభ్యులు భాగ్యలక్ష్మి, శిరీష, లలిత రేణుక, అనుష, లక్ష్మి, జంపాల మురళి, ఉమావిమల, సుజాత తదితరులున్నారు.