కరెంట్‌ కత సశేషమే

The current is the sameసుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి విద్యుత్‌ కమిషన్‌ బాధ్యతల నుంచి వైదొలిగారు. భారత ప్రధాన న్యాయమూర్తి అన్నట్టు ”న్యాయం జరిగినట్టు కనపడటానికి” ఇది కూడా తప్పనిసరై యుండవచ్చు. రేవంత్‌ సర్కార్‌ ‘తిక్క కుదిరింద’ని గులాబీ శ్రేణులు సంబరపడటం ఆశ్చర్యమే. అది కరెంటైనా, కాళేశ్వరమైనా కేసీఆర్‌ కడిగిన ముత్యంలా బయటపడతాడన్న నమ్మకం వారికున్నట్టుంది.
సుప్రీంకోర్టు విద్యుత్‌ కమిషన్‌ విచారణ విషయాల్లో జోక్యం చేసుకోలేదు. కమిషన్‌ ఆఫ్‌ ఇంక్వైరీ వద్దని, అది రాజకీయ కక్షపూరితమైందని కేసీఆర్‌ వాదన. ప్రస్తుతానికి దానికి సంబంధించి ఆయనకు ఊరటేమీ లభించలేదు. జస్టిస్‌ నర్సింహారెడ్డి విచారణ అంశాల మంచి చెడ్డల గురించి ముందే మీడియాతో ప్రస్తావించటాన్ని సుప్రీం తప్పుపట్టింది. దానితో ఆయన పదవి నుండి తప్పుకుంటున్నట్టు సుప్రీంకోర్టుకు నివేదించారు. ఆయన స్థానంలో మరో జడ్జీని నియమించుకోండని రేవంత్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతం ఆ పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేసీఆర్‌ వాదనేమంటే ఈఆర్‌సీ ఫైనలైజ్‌ చేసిన విషయాలపై అవసరమైతే అప్పీలేట్స్‌లో సవాలు చేయాలి గాని, దానిపై విచారణ కమిషన్లు వేయడమేమిటనేది కీలక వాదన. ఈ అంశం జోలికి సుప్రీంకోర్టు వెళ్లలేదు.
ఏనుగుల్ని వదిలేసి దోమల్ని పట్టుకున్నట్టుంది మన పాలకుల పని. 2003 విద్యుత్‌ చట్టం ప్రకారమే తమ సర్కారు నడిచిందన్నది కేసీఆర్‌ వాదన. ఆ చట్టం గురించిగాని, దాని సవరణ బిల్లు (2021) గురించి బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు సైలెంట్‌గా ఉన్నాయి. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ ప్రయివేటీకరణ వేగం పెరిగింది. ఇప్పటికే హైదరాబాద్‌ పాతబస్తీ బిల్లుల కలెక్షన్‌ అదానీకిస్తున్నట్లు వార్తలొచ్చాయి. యూనియన్లు ధర్నాలు చేస్తున్నాయి. పాలకుల నుంచిగాని అధికార యంత్రాంగం నుంచిగాని ఎటువంటి స్పందనా లేదు. కార్మికులను కొందరు అదానీ తమతోనే పని చేయించుకుంటాడని, లేకుంటే తమని వేరే సర్కిల్స్‌కి బదిలీ చేస్తారన్న భ్రమల్లో ఉన్నారు.
ఈలోపు రెండు డిస్కాంలలో స్తంభాల నుండి సబ్‌ స్టేషన్ల లైన్ల పొడవు (సర్క్యుట్‌ కి.మీ.), డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు వంటివన్నీ సంఖ్యలతో సహా లెక్కలు సేకరించి రీ సర్వే చేస్తున్నారు. 90శాతం పూర్తయింది. దీనిపై ప్రభుత్వం నోరిప్పట్లేదు.
ప్రజలు, ఉద్యోగులు దీని భావమేమి తిరుమలేశా? అని కనుబొమ్మలు చిట్లించి చూస్తున్నారు. తెలంగాణలో విద్యుత్‌రంగ అభివృద్ధి జరిగింది తన పాలనలోనే అంటూ కేసీఆర్‌ రొమ్ము విరుచుకోవడాన్ని పూర్తిగా కొట్టేయలేం. కాని తాను చేసినదంతా కరెక్టని బింకాలు పోవడం సత్యదూరమైన విషయం.
నీటి సౌకర్యమున్న చోటే థర్మల్‌ స్టేషన్లు కడతారనేది నిజమే ఐనా, అన్నీ గోదావరి మీదే ఉన్నాయి కాబట్టి ‘వెనకబడ్డ’ నల్లగొండ జిల్లా దామరచర్లలో కృష్ణా నదిపై యాదాద్రి థర్మల్‌ కేంద్రం నిర్మించామని చెప్పడం, దానికి సమీపంలో బందరు పోర్టుంది.. క్రిష్ణపట్నం పోర్టుంది అనడం విచిత్రం. బందర్లో ఇంకా పోర్టే నిర్మితం కాలేదు. మూడు జిల్లాలు దాటిపోతే క్రిష్ణపట్నం పోర్టు అందుతుంది. జనం నవ్వుకుంటారనే స్పృహ లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు జస్టిస్‌ నర్సింహారెడ్డికి రాసిన 12 పేజీల సుదీర్ఘ లేఖలో మాజీ సీఎం రాయడం ఆశ్చర్యమేమరి.
ఒకపక్క సింగరేణిని ముక్కలు ముక్కలుగా తన్నుకుపోయేందుకు ప్రయివేటు గద్దలు కాచుక్కూ చున్నాయి. విద్యుత్‌ పంపిణీ ప్రయివేటీకరించేందుకు ప్రస్తుత బీజేపీ, కాంగ్రెస్‌, గత బీఆర్‌ఎస్‌ వంటి ప్రభుత్వాలు చేస్తున్న ‘కృషి’ కోసం నోటకరుచుకుపోవటానికి చెట్టుకింద నిరీక్షించే నక్కబావల్లా ‘కార్పొరేట్లు’ సిద్ధంగా ఉన్నాయి.