విస్తరణ కోసం సామ్రాజ్యవాదం పాట్లు – ప్రమాదాలు

Imperialism for Expansion - Dangers”తన ప్రభావాన్ని, తన పెత్తనం కింద ఉండే భూభాగాన్ని సైతం విస్తరించుకోడానికి ద్రవ్య పెట్టుబడి అనివార్యంగా తీవ్రంగా పాటుపడుతుంది” అని లెనిన్‌ తన ప్రసిద్ధ గ్రంథం ”సామ్రాజ్య వాదం- పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ”లో పేర్కొన్నారు. సామ్రాజ్యవాద దేశాలు వాటిలో అవి తీవ్ర శత్రుత్వంతో తలపడుతున్న కాలంలో లెనిన్‌ ఈ గ్రంథాన్ని రాశారు. ఆ కాలంలో ప్రత్యర్ధులుగా ఉన్న ఆయా దేశాల ద్రవ్య పెట్టుబడులు అప్పటికే ప్రపంచాన్ని తమ నడుమ పంచుకుని వున్నందున ఇక విస్తరించడానికి అదనంగా మిగిలిన జాగా అంటూ ఏదీ లేకపోయింది. అందుచేత తమ తమ పెత్తనాల కింద ఉన్న ప్రాంతాలను మళ్ళీ మరోసారి పునర్విభజన చేసుకోవడం మినహా వారికి వేరే దారి లేకపోయింది. అందుకు పరస్పరం యుద్ధాలలో తలపడడం తప్ప వేరే పద్ధతి లేకుండా పోయింది. అయితే ఆ యుద్ధాలు సామ్రాజ్యవాదం మొత్తంగా బలహీనపడడానికే దారితీశాయి. అంతేకాక, సామ్రాజ్యవాద పెత్తనం నుండి విడిపోయి విప్లవాల ద్వారా సోషలిస్టు దేశాలు ఏర్పడడానికి, ఆ సోషలిస్టు దేశాల మద్దతుతో అనేక వలస దేశాలు సామ్రాజ్యవాదుల ఆధిపత్యం నుంచి బయటపడడానికి కూడా ఆ పరిస్థితులు దారి తీశాయి.
అనంతర కాలంలో పెట్టుబడి కేంద్రీకరణ కొనసాగింది. అంతేగాక అదిబలపడింది. ఆ శక్తితోనే ద్రవ్య పెట్టుబడి ఇప్పుడు సామ్రాజ్యవాదుల నడుమ ఉండే వైరుధ్యాన్ని అదుపు చేయగలుగుతోంది. అక్కడితో ఆగకుండా ఇప్పుడు యావత్తు ప్రపంచమూ తన స్వైర విహారానికి దాసోహం అనాలనే వైఖరి తీసుకుంది. ఈ నేపధ్యంలో ఐక్యంగా వ్యవహరిస్తున్న సామ్రాజ్యవాద శిబిరం ఒకప్పుడు తన పెత్తనం కింద ఉన్న భూభాగాల్లో మళ్ళీ పెత్తనం చెలా యించడానికి తయారౌతోంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, సామ్రాజ్యవాదం తమ లక్ష్యాలను నెరవేర్చుకోడానికి రెండు మార్గాలను అనుసరిస్తున్నాయి. మొదటిది: ప్రపంచం మొత్తం మీద నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థను బల వంతంగా రుద్దడం. ఈ విధానాలు వలస విముక్తి అనంతరం ఆయా దేశాలు సాధించిన పురోగతిని దెబ్బ తీస్తాయి. రెండవది: ఈ మొదటి ప్రయత్నం పని చేయని చోట్ల యుద్ధాలను పురికొల్పడం.
నయా ఉదారవాద వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గాన్ని బలహీనపరచింది. తన ఉత్పత్తి కార్యకలాపాలన్నింటినీ తక్కువ వేతనాలకే పని చేసే కార్మికులుండే మూడవ ప్రపంచ దేశాలకు తరలించుకుపోతానని బెదిరిస్తూ అది అభివృద్ధి చెందిన దేశాల కార్మికవర్గాన్ని బెదిరిస్తోంది. ఆ విధంగా అక్కడ వేతనాలను పెరగనివ్వకుండా స్తంభింపజేసింది. ఉత్పత్తి కార్యకలాపాలు తరలివచ్చిన మూడవ ప్రపంచ దేశాలలో సైతం కార్మికుల నిజ వేతనాలలో పెరుగుదల ఏమీ లేదు. అక్కడ నిరుద్యోగం ఏ మాత్రమూ తగ్గకపోవడమే దీనికి కారణం. వేతనాలలో ప్రపంచం మొత్తం మీద ఎక్కడా పెరుగుదల లేకపోవడంతో బాటు శ్రామిక ఉత్పాదకత బాగా పెరిగింది. దాని ఫలితంగా ఆర్థిక సంపదలో పెట్టుబడిదారుల వాటా బాగా పెరిగింది. ముఖ్యంగా సంపన్న దేశాల వాటా బాగా పెరిగింది. ఆర్థిక అసమానతలు వేగంగా పెరిగిపోయాయి. దానితోబాటు శ్రామికుల వేతనాలలో పెరుగుదల లేని కారణంగా వారిలో అత్య ధికులు, ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాల శ్రామికులు పోషకాహార లేమితో బాధ పడుతున్నారు. మరోపక్క సంపన్నుల వద్ద పోగుబడే సంపద ఎంత పెరిగినా, వారి వినిమయం ఆ మేరకు పెరగదు. కనుక సమాజంలో అధికోత్పత్తి సమస్య ముందుకొచ్చింది (అధికోత్పత్తి అంటే ఉత్పత్తి అయే సరుకుల పరిమాణం పెరగడం అని మాత్రమే అనుకోరాదు. ప్రజల కొనుగోలు శక్తికి మించి ఉత్పత్తి ఉంటే అది అధికోత్పత్తి అవుతుంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయి, ఉత్పత్తి అయే సంపద ఇదివరకటి స్థాయిలోనే ఉన్నా అది అధికోత్పత్తి అవుతుంది.).
ఈ అధికోత్పత్తి సమస్యను పరిష్కరించడానికి కీన్స్‌ సూచించిన మార్గం ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం. ఆ మార్గం ప్రస్తుత నయా ఉదారవాద వ్యవస్థలో అమలు చేయడం ప్రభుత్వాలకి సాధ్యం కాదు. ప్రభుత్వ వ్యయాన్ని పెంచి దేశంలో డిమాండ్‌ను బలపరచడానికి రెండు మార్గాలు న్నాయి. మొదటిది ద్రవ్య లోటును బాగా పెంచి రుణాలు తెచ్చి దానిని ఖర్చు చేయడం. రెండవది సంపన్నుల మీద అధికంగా పన్నులు వేసి ఆ ధనం ఖర్చు చేయడం. ఈ రెండు మార్గాలూ నయా ఉదారవాదానికి అంగీకారం కాదు. దానిని కాదని ఏ దేశమైనా ముందుడుగు వేస్తే వెంటనే ఆ దేశం నుండి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఒక్కపాటున తరలిపోతుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడు తుంది. అందుచేత ప్రతీ దేశమూ దాని నిబంధనలకు తలొగ్గి వ్యవహరిస్తున్నది.
నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థలో అనివార్యంగా తలెత్తిన ఈ అధికోత్పత్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మాంద్యంలోకి నెడుతోంది. ఇదే సమయంలో నయా ఫాసిజం ఉవ్వెత్తున ముందుకొస్తోంది. ఈ నయా ఫాసిస్టు శక్తులతో కార్పొరేట్లు జత కట్టడానికి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే నయా ఫాసిజం ప్రజానీకపు దృష్టిని ప్రస్తుత ఆర్థిక దోపిడీ నుంచి పక్కకు మళ్ళించగలిగే శక్తి కలిగివుంది. నయా ఫాసిస్టులు ప్రజలముందు వారి నిత్య జీవితపు భౌతిక పరిస్థితుల గురించి కాక, ఆ ప్రజల్లోని ఏవో కొన్ని మైనారిటీ సమూహాలపై (అవి మత పరంగా కాని, జాతి పరంగా గాని మైనారిటీలు కావచ్చు) విద్వేషాన్ని రెచ్చగొట్టి వారిని పరాయివారిగా చిత్రిస్తుంది. కొన్ని దేశాలలో నయా ఫాసిస్టు శక్తులు అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. మరికొన్ని దేశాలలో అధికారం కోసం అర్రులు చాస్తున్నాయి. ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థల్లో నయా ఫాసిస్టు శక్తులు అధికారాన్ని పూర్తిగా చేజిక్కించుకోడానికి సాపేక్షంగా కొంత సమయం పట్టవచ్చు.
ఈ నయా ఫాసిస్టు శక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయా దేశాలలో అధికోత్పత్తి సమస్య పరిష్కారం కాదు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నయా ఉదారవాద చట్రం లోపలే నడుస్తూ వుంటుంది. అందుచేత అక్కడ ప్రభుత్వ వ్యయం పెంచి అధికోత్పత్తి సమస్యను పరిష్కరించడం ఆ నయా ఫాసిస్టు ప్రభుత్వాలకి కూడా సాధ్యం కాదు. ఆయా దేశాల ప్రభుత్వాలు ఆర్థిక మాంద్యం సమస్యని పరిష్కరించడంలే విఫలం అయినందువల్ల అక్కడ నయా ఫాసిస్టు శక్తులు బలపడితే దానికి సామ్రాజ్యవాదాన్ని ఎలా బాధ్యుల్ని చేస్తారు మీరు? అని కొందరు అడగ వచ్చు. సమాధానం ఒక్కటే. ఆర్థిక మాంద్యం నుండి బయట పడాలంటే ఏ దేశమైనా నయా ఉదారవాద చట్రం పట్టునుండి బయటపడాలి. అలా బయటపడేందుకు ఏ దేశమైనా ప్రయత్నిస్తే వెంటనే సామ్రాజ్యవాద దేశాలు, మరీ ముఖ్యంగా అమెరికా ఆ దేశం మీద ఆంక్షలు విధిస్తాయి. ఆ విధంగా సామ్రాజ్యవాదం తన గతకాలపు పెత్తనాన్ని తిరిగి సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచమంతటా ప్రజానీకాన్ని తీవ్ర దారిద్య్రంలోకి, కడగండ్లలోకి నెట్టడమే కాకుండా నయా ఫాసిస్టు శక్తులు బలపడడానికి సైతం ఊతం ఇస్తున్నాయి.
ఇక సామ్రాజ్యవాదం అనుసరించే రెండో మార్గం యుద్ధాలను పురికొల్పడం. ప్రస్తుతం నడుస్తున్న రెండు యుద్ధాలూ ప్రపంచాన్ని వినాశనం అంచుకు నెడుతున్నాయి. ఈ రెండు యుద్ధాలూ ఇలా కొనసాగడానికి వాటి వెనుక సామ్రాజ్యవాదం పోషిస్తున్న పాత్రే ప్రధాన కారణం. అంతే కాదు, ఈ రెండు యుద్ధాలూ అణు యుద్ధాలుగా మారిపోయే ప్రమాదం కూడా ఉంది. ఉక్రెయిన్‌ యుద్ధాన్నే తీసుకోండి. సోవియట్‌ యూనియన్‌ పతనం అయిన తర్వాత ‘ఇకముందు నాటోను తూర్పు దిశగా విస్తరించబోము’ అని సామ్రాజ్యవాద దేశాలు మిఖాయిల్‌ గోర్బచేవ్‌కు హామీ ఇచ్చాయి. కాని దానిని ఉల్లంఘించి ఉక్రెయిన్‌ వరకూ విస్తరించాయి. వాస్తవానికి ఉక్రెయిన్‌ కూడా నాటోలో చేరడానికి సుముఖత చూపలేదు. ఆ దేశంలో ఎన్నికల్లో గెలిచి దేశాధ్యక్షుడు అయిన విక్టర్‌ యానుకోవిచ్‌ నాటోలో చేరడానికి అంగీకరించలేదు. దానితో అతడిని కుట్ర ద్వారా కూలదోశారు. ఆ దేశానికి అమెరికా ప్రతినిధిగా వ్యవ హరించిన విక్టోరియా న్యూలాండ్‌ ఉక్రెయిన్‌లో గతంలో హిట్లర్‌కు అనుచరుడుగా వ్యవహరించిన స్టెపాన్‌ బండేరా కు చెందిన మద్దత్తుదారులను ఈ కుట్ర తర్వాత గద్దెనెక్కించారు. ఈ కొత్త తొత్తు ప్రభుత్వం నాటో కూటమిలో చేరడానికి సిద్ధపడింది. అంతేగాక, ఉక్రెయిన్‌లో రష్యన్‌ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతం మీద దాడికి తలపడి వేలాది మంది ప్రాణాలు తీసింది. దాంతో రష్యా జోక్యం చేసుకోవలసివచ్చింది.
ఈ యుద్ధం కొనసాగడానికి రష్యా ప్రధాన కారణమా లేక సామ్రాజ్యవాదులా అన్నది ప్రశ్న. దీనిని నిగ్గు తేల్చాలంటే ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఉక్రెయిన్‌కు, రష్యాకు మధ్య శాంతి ఒప్పందం జరగ కుండా అడ్డు పడుతున్నదెవరు?గతంలో ఫ్రాన్స్‌, జర్మనీ చొరవ చేసి ఈ రెండు దేశాలకూ నడుమ ఒక ఒప్పందం జరగడానికి కృషి చేశాయి. దానినే మిన్స్‌క్‌ ఒప్పందం అంటారు. ఆ ఒప్పందం మీద ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడు సంతకం చేసే లోనే అమెరికా పనుపున అప్పటి బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హుటాహుటిన కీవ్‌ పట్టణానికి వెళ్ళి ఆ సంతకాలు జరగకుండా అడ్డుపడ్డాడు. పోనీ, సామ్రాజ్యవాద దేశాలలో కనీసం ఫ్రాన్స్‌, జర్మనీ అయినా శాంతి కావాలి అని తాపత్రయంతో ఉన్నాయి అనుకుందామా అంటే అదీ లేదు. ఈ మధ్యనే జర్మనీ దేశాధినేత ఎంజెలా మెర్కెల్‌ ఒక ప్రకటన చేసింది. మిన్స్‌క్‌ ఒప్పందం అనేది ఉక్రెయిన్‌ యుద్ధానికి పూర్తిగా సిద్ధపడేవరకూ వ్యవధి తీసుకోడానికి ఒక సాకుగా మాత్రమే ప్రతిపాదించాం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ యుద్ధం వెనుక అసలు లక్ష్యం ఏమంటే రష్యా దేశాన్ని సామ్రాజ్యవాదుల పెత్తనం కిందకు తీసుకురావడమే. రష్యాకు బోరిస్‌ యెల్స్టిన్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాదాపు రష్యా సామ్రాజ్యవాదుల పెత్తనం కిందకు పోయినంత పనైంది.
ఇక రెండో యుద్ధాన్ని తీసుకోండి. ఇజ్రాయిల్‌ అత్యంత క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా పాలస్తీనా ప్రజలమీద అదే పనిగా దాడులు చేస్తూనేవుంది. ఇప్పుడు ఆ దాడులు లెబనాన్‌కు కూడా వ్యాపించాయి. అమెరికా సామ్రాజ్యవాదం ఇజ్రాయిల్‌లోని జాత్యహంకార ప్రభుత్వానికి పూర్తి అండగా నిలిచింది. ఇజ్రాయిల్‌ ప్రభుత్వ నేతలకు అమెరికా రాజకీ యాలను ప్రభావంతం చేసే శక్తి ఉన్నందునే ఈ మద్దత్తు పొందగలుగుతోంది అని పైపైన చూస్తే అనిపిస్తుంది. కాని అది పూర్తి గా తప్పు. బైటనుండి వలసదారులుగా పాలస్తీనా వచ్చి ఆఖరికి ఆ దేశస్తులైన పాలస్తీనా ప్రజలనే అక్కడినుంచి వెళ్ళగొట్టే ”వలసదారీ సామ్రాజ్యవాదం” (సెటిలర్‌ కొలోనియలిజం)లో పాత్రధారి ఇజ్రాయిల్‌ అయినా. అసలు సూత్రధారి మాత్రం సామ్రాజ్యవాదమే. ఆ వలసదారీ సామ్రాజ్యవాద విస్తరణ కోసమే ఇజ్రాయిల్‌ అక్కడ పాల స్తీనా జాతిని మొత్తంగా తుడిచి పెట్టడానికి పూనుకుంది. ఆ మధ్య ఆసియా ప్రాంతాన్ని మొత్తంగా ఇజ్రాయిల్‌ ద్వారా తన ఆధీనం లోకి తెచ్చుకోవడమే సామ్రాజ్యవాదం అసలు లక్ష్యం.
హమాస్‌ దుందుడుకుగా వ్యవహరించినందువల్లనే ఈ యుద్ధం మొదలైందని కొందరు వాదిస్తున్నారు. ఇజ్రాయిల్‌ది ప్రతీకారంగానే పరిగణిస్తున్నారు. కానీ ఈ యుద్ధం కొనసాగడానికి ఎవరు కారణమో నిగ్గు తేల్చాలంటే ఇందాకటి ప్రశ్ననే ఇక్కడ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మధ్య ఆసియాలో శాంతి నెలకొనడానికి ఎవరు ఆటంకం? పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ. ఐరాసలో 194వ సభ్య దేశంగా ప్రకటించడానికి ఐరాస జనరల్‌ అసెంబ్లీలో తీర్మానం పెట్టిన ప్రతీసారీ దానిని వీటో చేస్తున్నది అమెరికానే. ఆ తీర్మానాన్ని ఆమోదించడం వలన ఆ ప్రాంతంలో సుస్థిరమైన శాంతిని నెలకొల్పడానికి సాధ్యపడుతుంది. ఒకవైపు ఇజ్రాయిల్‌, పాలస్తీనా రెండు దేశాలుగా పరిగణించ డానికి అంగీకరిస్తూనే అమెరికా దానిపై తీర్మానాన్ని వీటో చేయడం బట్టి అమెరికా పాలస్తీనాను ఒక దేశంగా అంగీ కరించడం అనేదే బూటకం అని స్పష్టమవుతోంది. ఇజ్రాయిల్‌, పాలస్తీనాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి అంటూ అప్పుడప్పుడూ అమెరికా చేసే హడావుడి అంతా ఒక నాటకం. ఇజ్రాయిల్‌ ప్రభు త్వం మాత్రం అమెరికా అందిస్తున్న పూర్తి దన్నుతో విర్రవీగుతూ విచ్చలవిడిగా వ్యవహరిస్తోంది. ఈ దాడులు తీవ్రం ఔతూన్నకొద్దీ అది ఒక అణుయుద్ధంగా మారిపోయే ప్రమాదం నడినెత్తిన ఉంది.
ఆ విధంగా సామ్రాజ్యవాదం ఒక పక్క నయా ఉదారవాదాన్ని, రెండో పక్క యుద్ధాన్ని సాధనాలుగా చేసుకుని తన ప్రపంచవ్యాప్త పెత్తనానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం ఒకపక్క నయా ఫాసిజానికి, రెండో పక్క మానవజాతి వినాశనానికి దారి తీస్తుంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌