‘ఇండియా టుడే’ 2023, అక్టోబర్ 4-5 తేదీలలో ముంబైలో ఏర్పాటు చేసిన తన వార్షిక సమ్మేళనంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ుపై ”ఆరెస్సెస్ 100 ఇయర్స్ : వై ఎం.ఎస్.గోల్వాల్కర్ ఇన్డ్యూర్స్” అనే విషయంపై ఒక ప్రత్యేక చర్చాగోష్టి నిర్వహించింది. దీనిలో పాల్గొన్న సంవాద భాగస్వాములంతా (ప్యానలిస్ట్స్) మిశ్రమ స్రవంతుల నుండి వచ్చారు. దీనిలో రెండు ప్రధాన మైన విషయాలు చర్చల్లోకి వచ్చాయి. ఒకటి, జాతి నిర్మాణంపై గోల్వాల్కర్ భావన, మైనార్టీల పట్ల ఆయన వైఖరికి సంబంధించినది, రెండోది భారత రాజ్యాంగాన్ని ఆయన అప్రతిష్టపాలు చేసిన విష యానికి సంబంధించినది. నేడు దేశంలో మైనార్టీల అవస్థల గురించి, ప్రస్తుత బీజేపీ నాయకత్వంలోని పాలక ప్రభుత్వం, భారత రాజ్యాంగాన్ని విమర్శించడం ద్వారా భారత రాజకీయ పరిస్థితులపై గోల్వాల్కర్ రాజకీయాల వాస్తవ ప్రభావం గురించి ఎవరూ ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు.
”ఇప్పుడు జర్మన్ జాతిగర్వం నేటి చర్చనీయాంశంగా మారింది. జాతి స్వచ్ఛతను, సంస్కృతిని కొనసాగించడానికి, యూదుల దేశాన్ని ప్రక్షాళన చేయడం ద్వారా జర్మనీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక్కడ జాతి గర్వం చాలా ఉన్నత స్థాయిలో వ్యక్తీకరించబడింది. భిన్నమైన అభిప్రాయాలున్న జాతులు, సంస్కృతులు ఏకీకతం కావడం దాదాపుగా ఎంత అసాధ్యమైన విషయమో జర్మనీ చూపించింది. హిందుస్థాన్‌లో ఆ విషయాన్ని తెలుసుకొని, లాభం పొందే మంచి పాఠం” అని గోల్వాల్కర్ ”విరు ఆర్ అవర్ నేషన్ హుడ్ డిఫైన్డ్” అనే తన రచనలో రాశాడు. దీనికి ప్రతిస్పందనగా, దీనిని ఆయా సంద ర్భాన్ని బట్టి చూడాల్సి ఉంటుందని, సుఫల సేకరణ (చెర్రీ పికింగ్), ఒక వ్యక్తి లేదా సంస్థ భావజాలాన్ని ప్రతిబింబించదని ఈ చర్చలో హిందూత్వ జాతీయవాదానికి అనుకూలంగా మాట్లాడిన వారు అన్నారు.
దీనిని ఎదుర్కొనడానికి, ఈ చర్చలోని సభ్యుడు 1972లో ‘ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’ సంపాదకుడైన కుశ్వంత్ సింగ్‌కు ఇచ్చిన తన ఇంటర్వ్యూను ఉదహరించాడు. దాని ప్రకారం గోల్వాల్కర్ ఇలా అన్నాడు, ”చారిత్రక పరిస్థితుల కారణంగా, ముస్లింలు విశ్వాస పాత్రులను విభజించారు. కానీ, దీనికి హిందూ ముస్లింలు ఇరువురూ బాధ్యత వహించాలి.” ఆర్‌ఎస్‌ఎస్ ప్రస్తుత సర్సంగ్ చాలక్ అయిన మోహన్ భగవత్, 2018లో తన విజ్ఞాన్ భవన్ ప్రసంగాల్లో మరింత సామరస్య పూర్వకంగా మాట్లాడినాడు. అసలు హిందూ, ముస్లింల డీఎన్‌ఏ కూడా ఒకటేనని అన్నాడు. ఆయన హత్యలకు పాల్పడుతున్న వారిపై కూడా మాట్లా డుతూ, ”వారు హిందూత్వంకు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రజలపై కొన్ని తప్పుడు హత్య కేసులు కొన్ని సందర్భాల్లో నమోదు అవుతున్నప్పటికీ, కూడా ‘భారతదేశంలో ఇస్లాం ప్రమాదంలో ఉంది’ అనే భయం చక్రంలో చిక్కుకోవద్దని” అన్నాడు.
1939 నాడు రచించబడిన పుస్తకం నుండి 1972 నాటి ఇంటర్వ్యూ, ఇప్పటి ఆర్‌ఎస్‌ఎస్ సర్సంగ్ చాలక్ ఉపన్యాసం వరకు భాషలో ఎంతటి మార్పు సంభవించింది. కానీ, గోల్వా ల్కర్ కీలకపాత్ర పోషించి, నిర్మించిన విస్తృతమైన ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థల చర్యల ఫలితాల గురించి ఏమిటి? ఆర్‌ఎస్‌ఎస్ శాఖలలో (స్థానిక ఆరెస్సెస్ శాఖలు), సరస్వతీ విద్యాలయాల్లో (ఆరెస్సెస్ నిర్వహణలోని పాఠశాలలు) ఏమి బోధిస్తారు? అనేక అనుబంధ సంస్థలున్న సంస్థ అదుపులో ఉండే మితవాద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు, సోషల్ మీడియా ద్వారా ఏమి ప్రచారం చేస్తున్నాయి? ఇది దాని బోధనలపై ఆధిపత్యం వహించే స్వచ్ఛమైన ”ఇతరులను ద్వేషించే” భావ జాలం. సంస్థ యొక్క ఉద్దేశ్యం కేవలం మారుతున్న భావాల వ్యక్తీకరణలో లేదు, కానీ దాని ప్రభావం, సామాజిక మౌలిక నిర్మాణం పైన, అవస్థల పాలవుతున్న ముస్లిం మైనారిటీల పైన ఉంటుంది.
ఒక రకంగా చెప్పాలంటే, 1937లో గోల్వాల్కర్ ఏదైతే చెప్పాడో అదే నేడు జరుగుతున్న వాస్తవం. పౌరహక్కుల కోసం అడగకుండా అట్టడుగు వర్గాల ప్రజలుగా మాత్రమే వారు జీవించవచ్చని, ఈ వ్యవస్థలో వారి స్థానం ద్వితీయమైనదేనని ఒక దాని తర్వాత ఒకటిగా జరిగిన సంఘటనలు, మతపరమైన మైనార్టీ ప్రజలకు చెప్పాయి. ఎలాంటి ఫలితాలు సంభవిస్తాయో ఆలోచించకుండా హత్యలకు పాల్పడినప్పుడు, భగవత్, అతని ముఠా సభ్యుల నోర్లు మూతపడ్డాయి. ఆరెస్సెస్ యొక్క అనేక అనుబంధ సంస్థల మధ్య జరిగిన తెలివైన ‘పని విభజన’, క్షేత్ర స్థాయిలో జరిగే అనేక తప్పిదాల నుండి మాతృ సంస్థను కాపా డుతుంది. ఆరెస్సెస్ పూర్వ ప్రచారక్, ప్రస్తుత ప్రధాన మంత్రి స్వయంగా ఆరెస్సెస్ శాఖలలో శిక్షణ ఇచ్చి, కార్యకర్తల్ని అప్రమత్తం చేస్తాడు. ”మేమిద్దరం, మాకు (హిందువులు) ఇద్దరు – వారు (ముస్లింలు) ఐదుగురు, వారికి ఇరవై ఐదు మంది”, ”వారి బట్టలను బట్టి వారిని గుర్తించవచ్చు”, ”హిందూ శ్మశాన వాటిక, ముస్లిం కబరస్థాన్”, ”రాణా ప్రతాప్ గోరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు” లాంటి మాటలు, సమాజంలో విభజన, హింస, ద్వేషానికి దారితీసే సామాజిక ఆలోచనను శాసించే కొన్ని సంకేతాలు.
బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడి, ఆమె కుటుంబ సభ్యుల్ని హత్య చేసి, హింసకు పాల్పడిన వారిని ముందస్తుగా విడుదల చేసి, వారి ఎంపీ వారిని పూలదండలతో స్వాగతించి ప్రజల ముందు ఉంచిన సందర్భం, ఆరెస్సెస్ ఉన్నత స్థాయి శ్రేణుల నుండి ఆమోదం పొందడం జరిగింది. ఎన్‌ఆర్సీ, సిఏఏ ద్వారా పెద్దసంఖ్యలో ముస్లింల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ముస్లిం వ్యాపారస్తులను బహిష్కరిం చాలనే పిలుపు సాధారణమైన విషయంగా మారింది. అదే విధంగా తమ కూడూ గూడూ వదిలి వెళ్ళాలని అనేక మంది ముస్లింలను బెదిరిస్తున్నారు. 1939లో ఇంకా గోల్వాల్కర్ దృష్టిలో ఏమి ఉంది?
భారత రాజ్యాంగానికి సంబంధించినంత వరకు, గోల్వాల్కర్ ఆరెస్సెస్ అధినేతగా ఉన్న సమయంలో, ఆరెస్సెస్ అనధికార పత్రిక ”ఆర్గనైజర్” ఇలా రాసింది : ”కానీ మన రాజ్యాంగంలో, ప్రాచీన భారత దేశంలో విశిష్టమైన రాజ్యాంగ అభివృద్ధి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. మనువు చట్టాలను స్పార్టాకు చెందిన లైకర్గస్ లేదా పర్షియాకు చెందిన సోలోన్ కంటే ముందుగానే రాయడం జరిగింది. నేటికి కూడా మనుస్మృతిలో ప్రవచించబడిన చట్టాలు ప్రపంచంలో ప్రశంసలు పొందుతున్నాయి. కానీ మన రాజ్యాంగ పండితులకు ఇవేవీ ముఖ్యమైనవి కాదు.”
ఈ అంశంపై భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చన్న పరిస్థితుల్లో జాతీయవాదం మద్దతుదారులు దీనిని సమర్ధిం చారు. వాస్తవం. తన విజ్ఞాన భవన్ ఉపన్యాసాలలో మోహన్ భగవత్ భారత రాజ్యాంగంలోని పీఠికను చదివాడని ఎవరైనా గమనించవచ్చు. కానీ, మాటలు, చేతలు రెండు నాల్కల ధోరణి వాడకానికి మధ్య ఒక నిజమైన ద్వైదీభావం (డైకటమీ)తో ప్రజా స్వామిక, లౌకిక, సామ్యవాద స్వభావం గల మన రాజ్యాంగం, స్థిరమైన హిందూ జాతీయవాద సిద్ధాంతకర్తల నుండి తీవ్రమైన దాడికి గురవుతుంది. ”రాజ్యాంగానికి కట్టుబడి భారతదేశ చరిత్ర ను, ప్రాచీన వారసత్వాన్ని, సంస్కృతిని, నాగరికతను విస్మరిస్తూ, దానిని ఒక పౌరదేశం స్థాయికి తగ్గిస్తున్నారు, నేను భారత దేశాన్ని ఒక నాగరికత గల రాజ్యం స్థానంలో ఉంచుతానని” జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ధూళిపూడి శాంతిశ్రీ వాదిస్తుంది.
ఈ రాజ్యాంగం వలసవాదానికి సంకేతమనీ, ఇది క్రైస్తవ ధర్మ మూలాలను కలిగి ఉందని మరొక సిద్ధాంతకర్త జే.సాయి దీపక్ వాదిస్తున్నాడు. ఆయన చెప్పే దాని ప్రకారం, ప్రకృతి, మతం, సంస్కృతి, చరిత్ర, విద్య మరియు భాషా రంగాలలో భారత రాజ్యాంగాన్ని విడగొట్టడానికి మనసు యొక్క నిర్వల సీకరణ (డీకాలనైజేషన్) అవసరం. ముఖ్యంగా, వలసవాద భాషలో చేసే ఆలోచన, వలసవాదం వైపు వెళ్ళే విధంగా మనసుపై ప్రభావం చూపుతుందని ఆయన విశ్వసిస్తాడు.
వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి ఛీఫ్ బిబేక్ దేబ్రారు ఈ విధంగా అన్నాడు :
‘ఈ రాజ్యాంగం వలసవాద వారసత్వానికి చెందినది’ ఈ రాజ్యాంగంలోని అనేక నిబంధనలు ముఖ్యంగా సామ్యవాదం (సోషలిజం), లౌకికవాదం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛల విలు వల్ని ఆయన ప్రశ్నిస్తాడు. దేబ్రారు, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అభిప్రాయాల్ని ప్రతిబంబించడం లేదని చెప్ప డానికి అనాసక్త ప్రయత్నం జరిగింది. కానీ వాస్తవం ఏమంటే, గోల్వా ల్కర్ కోరుకున్నది ఇదే, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం కూడా ఇదే.
దాని (ఆరెస్సెస్) ప్రధానమైన ఎజెండాలో ఎలాంటి మార్పు లేదు. ప్రతీ ఒక్కరికీ మరింత ఆమోదయోగ్యం చేయడానికే ఈ ప్రయత్నం జరుగుతోంది. సంవాద భాగస్వాములు కొందరు అతనిని పాతతరానికి చెందిన వ్యక్తి అని అనవచ్చు, ఆయన భావాల వ్యక్తీకరణ పాత తరానికి చెందినవి కావచ్చు, కానీ అతని ఎజెండా మాత్రం నేటి సామాజిక సన్నివేశంపై ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది.
( ”ద వైర్” సౌజన్యంతో )
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451
రామ్ పునియానీ