నందికొండ ఛైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఖరారు

– ఛైర్మన్‌ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నికల అధికారులు
– 22న ఛైర్మన్‌,వైస్ ఛైర్మన్‌ ఉత్కంఠకు తెర
– కాంగ్రెస్ ఎన్నిక లాంఛనమే
– ఆశావాహులు ఎందరున్నా.. ఇద్దరి మధ్యనే తీవ్రపోటీ
నవతెలంగాణ – నాగార్జునసాగర్
నందికొండ  మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమమైంది.మార్చి 22న సమావేశం నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్‌ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నికకు గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లయింది.నాగార్జునసాగర్  ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండటం మున్సిపాలిటీని కైసవం చేసుకోవడమే లక్ష్యంగా ఎమ్మెల్యే చేరికలను ప్రోత్సహించడంతో నందికొండలో కాంగ్రెస్‌ సభ్యుల మెజార్టీ పెరిగింది.
అవిశ్వాస పరీక్షలో నెగ్గడంతో: నందికొండ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస పరీక్షలో నెగ్గడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. నందికొండలో ఫిబ్రవరి 15న అవిశ్వాసం ప్రవేశపెట్టి తీర్మానం నెగ్గిన కారణంగా నందికొండ మున్సిపల్‌ చైర్పర్సన్ అనూష రెడ్డి, వైస్‌ చైర్మన్‌ మంద రఘువీర్ లు పదవీచ్యుతులు కాగా వారి స్థానంలో కొత్తవారిని ఎన్ను కోవలసి ఉంది. నందికొండ మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గడంతో జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి  ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఎలక్షన్‌ కమిషన్‌కు సమాచారం అందించారు. దీంతో మార్చి 22న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల పదవులకు ఎన్నికలు నిర్వహించేలా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
హస్తగతం లాంఛనమే: నందికొండ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి కాంగ్రెస్‌ సభ్యుల మెజార్టీ ఉండటంతో హస్తగతం కావడం లాంఛనమే కానుంది.అవిశ్వాసం నెగ్గిన అనంతరం బిఅరెస్ పార్టీకి మెజార్టీ సభ్యులు ఉండగా మారిన రాజకీయ సమికరణాలలో భాగంగా ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో కాంగ్రెసుకు మెజార్టీ పెరిగింది.దీనితో కాంగ్రెస్ కు 6గురు సభ్యులు ఉండగా బిఅరెస్ కు 5గురు సభ్యులు ఉన్నారు.3వ వార్డు కౌన్సిలర్ శిరీష మోహన్ నాయక్ మరియు 8వ వార్డు కౌన్సిలర్ అన్నపూర్ణ మధ్య తీవ్రపోటీ నెలకొంది.కాంగ్రెస్ పెద్దలు సహకరిస్తే నందికొండ మున్సిపల్‌ చైర్మన్‌గా 8వ వార్డు కౌన్సిలర్‌ అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌గా 3వ వార్డు కౌన్సిలర్‌ శిరీష మోహన్ నాయక్ ఎన్నికయ్యే అవకాశం ఉంది.చివరి నిమిషంలో మార్పులు చోటు చేసుకుంటే అటు ఇటయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకోవడం విశేషం.