నేటి నుంచే నామినేషన్ల పర్వం

– చేవెళ్ల అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సాయిరాం
– 10వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్స్‌ స్వీకరణ
– నవంబర్‌ 13న స్క్రూట్ని, 15న గుర్తుల కేటాయింపు
– ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి
– అభ్యర్థితో ఐదు మందికి అనుమతి
నవతెలంగాణ-చేవెళ్ల
నేటి నుంచి చేవెళ్ల అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థుల నామినేషన్స్‌ ప్రక్రియ మొదలవుతుందని, ఉదయం 10గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు అధికారులు స్వీకరిస్తారని చేవెళ్ల అసెంబ్లీ -53 ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సాయి రాం మీడియాకు తెలిపారు. గురువారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈ నెల 3వ తేదీ నుండి 10 తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. మధ్యలో వచ్చే ఒక ఆదివారం సెలవు దినంగా ఉంటుందని తెలిపారు. అభ్యర్థి వెంట నలుగురు మాత్రమే కార్యాలయంలోకి నామినేషన్‌ వేసేందుకు రావాలని తెలిపారు. నామినేషన్‌ కార్యా లయం నుండి 100 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు ఉంటాయని, కేవలం అభ్యర్థికి సంబంధించిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని, మిగతావారు 100 మీటర్లకు దూరంగా ఉండాలని తెలిపారు. కార్యాలయం ఆవరణ వెలుపల మీడియా గ్యాలరీ ఏర్పాటు చేస్తామని ఎప్పటికప్పుడు సాయంత్రం మూ డు గంటల వరకు నామినేషన్స్‌ పూర్తి సమాచారాన్ని మీడియా ద్వారా అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో కూడా ఆయా నామినేషన్స్‌ పత్రాలను ఉంచుతామని తెలిపారు. ఈ నెల 13న స్క్రూట్ని ఉంటుందని చెప్పారు. మొత్తం 298 పోలిం గ్‌ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో 57 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తించినట్లు చెప్పారు. ఇందులో 50 నాలుగు మండలాలో, 7 నవాబ్‌పేట్‌ పోలింగ్‌ కేంద్రాలలో వీడియో ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను చిత్రీకరిస్తామని చెప్పారు. ఈనెల 15న గుర్తులు ప్రకటిస్తామని చెప్పారు.
నగదు, మద్యం పట్టివేత
ఇప్పటి వరకు రూ.2 కోట్ల 90 లక్షల నగదును పట్టుకున్నట్టు చెప్పారు. ఇక మద్యం విషయానికి వస్తే 456.919 లీటర్లు పోలీసులు పట్టుకోగా ఎక్సైజ్‌ శాఖ 5493.6 లీటర్స్‌ పట్టుకున్నారు.అలాగే 6473.4 లీటర్ల బీర్లు కేసులు పోలిస్‌ శాఖ నమోదు చేయగా, కేసులు ఎక్సైజ్‌ శాఖ చేసింది. ఈ మీడియా సమావేశంలో తహసీల్దార్‌ కృష్ణయ్య, సురేందర్‌, చిన్న అప్పలనాయుడు, జయరాం, గౌతమ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్‌తో పాటు జత పర్చాల్సిన పత్రాలు, సూచనలు
1. నామినేషన్‌ ఫారం -2 దీ. (అన్ని కాలములు పూర్తిగా నింప వలెను )
2. రూ.10/- నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్‌ పైన నోటరీ అఫిడవిట్‌ ఫారం – 26 ( అన్ని కాలాలు పూర్తిగా నింపవలెను).
3. 2 స్టాంపు సైజు ఫోటోలు (2ఞ2.5 సెంటి మీటర్లు).
4. డిపాజిట్‌ పైకం రూపాయిలు 10,000/- జనరల్‌ కేటగిరి రూపాయిలు 5,000/- ఎస్సీ, ఎస్టీ, కేటగిరి ( కుల ధ్రువీకురణ పత్రంతో సహా )
5. పోటీ చేసే అభ్యర్థి వేరే నియోజక వర్గం నకు చెందిన ఓటరు నట్లయితే సంబంధిత ఈ ఆర్వో నుంచి ఓటరు ధ్రువీకణ పత్రం.
6. నామినేషన్‌ వేసే రోజుకు ఒక రోజు ముందుగా జాతీయం చేయబడిన బ్యాంకు నందు తెరిచిన బ్యాంకు అకౌంట్‌ వివరాలు, మొదటి పేజి జిరాక్స్‌ కాపీ సమర్పించాలి.
7. జాతీయ లేదా రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయితే ఒక ప్రతిపాదిత ఓటరు.
8. ప్రతిపాదిత ఓటరు ఖచ్ఛితంగా ఈ నియోజకవర్గంనకు సంబంధించిన ఓటరై ఉండాలి.
9. గుర్తింపు పొందని పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులుగా పోటీ చేసి అభ్యర్థులకు 10 మంది ప్రతిపాదిత ఓటర్లు ఉండాలి.
10. ఫారం-26 నందు ఐటెం 8 వర్తించు అభ్యర్థి అయితే ప్రభుత్వ బకాయిలు లేనట్లు సంబంధిత అధికారితో జారి చేయబడిన ధ్రువీకరణ పత్రం.
11. గుర్తింపు పొందిన జాతీయ / రాష్ట్ర పార్టీ అభ్యర్థి అయినట్లయితే ఫారం – ఏ, ఫారం బీ లు సమర్పించాలి.