
గంపెడాశలతో గల్ఫ్ దేశం వెళ్లిన వలస జీవి శవపేటికలో శవమై ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన విక్కుర్తి ఎల్లయ్య గౌడ్ (45) అప్పులు తీర్చేందుకు ఆరు నెలల క్రితం కంపెనీ వీసా పై దుబాయ్ వెళ్ళాడు. జీతం తక్కువ ఉండడంతో అప్పులు తీరేలా లేవని తీవ్ర మనోవేదన గురై ఈనెల 4న రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తోటి కార్మికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతి చెందిన 5 రోజులకు డెడ్ బాడీ ఆదివారం స్వగ్రామం చేరింది. మృతుని కుటుంబ సభ్యులు శవపేటికపై పడి రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతునికి భార్య రేణుక, కుమారుడు రేహ్వాన్ ఉన్నారు.బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.