మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాల గడువు 11 వరకు పొడిగింపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో 2024-25 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో మొత్తం సీట్లతోపాటు ఏడు నుంచి పదో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఖాళీ సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం ఈనెల 11వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు మోడల్‌ స్కూళ్ల అదనపు సంచాలకులు ఎస్‌ శ్రీనివాసాచారి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 194 మోడల్‌ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని తెలిపారు. ఆరో తరగతిలో ఒక్కో పాఠశాలలో వంద సీట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఓసీలు రూ.200, ఎస్సీ,ఎస్టీ,బీసీ, వికలాంగులు, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు రూ.125 దరఖాస్తు ఫీజు చెల్లించాలని కోరారు. ఇతర వివరాల కోసం http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.