నవతెలంగాణ- దుబ్బాక : ఒంటరిగా ఉంటున్న ఓ యువకుడి మృతదేహం కుళ్ళిపోయి అనుమానస్పద స్థితిలో ఉండడం తీవ్ర కలకలం రేపింది.ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కేంద్రంలోని 14 వ వార్డులో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఎస్ఐ వీ.గంగరాజు,స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.పట్టణ కేంద్రానికి చెందిన కారంపూరి గణేష్ (38) తండ్రి భీమయ్య అనే యువకుడు గ్లాస్ ఫిట్టింగ్ పని చేసుకుంటూ తన సొంతింటిలోనే ఒంటరిగా ఉంటున్నాడు.తల్లిదండ్రులు గతంలోనే చనిపోయారు.కొద్దిరోజులుగా ఆ యువకుడి నుండి ఫోన్ రాకపోవడంతో పట్టణానికి చెందిన కారంపూరి లక్ష్మీనారాయణ మంగళవారం ఉదయం వాకింగ్ వెళ్లే సమయంలో గణేష్ ఇంటికి వెళ్లి చూడగా.. ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించాడు.వెంటనే గణేష్ సోదరికి ఫోన్ చేసి చెప్పాడు.సోదరి వచ్చిన వెంటనే అందరూ కలిసి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి గణేష్ అనుమానాస్పదంగా కుళ్ళిపోయిన స్థితిలో మృతి చెంది ఉన్నాడు.ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి.పోలీసులకు సమాచారం అందించడంతో ఆధారాలు సేకరించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాకలోని ప్రభుత్వ ఏరియా వంద పడకల ఆస్పత్రికి తరలించారు.మృతుని సోదరుడు నగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.