– అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో..కలెక్టరేట్ల ఎదుట అంగన్‌వాడీల ధర్నా
నవతెలంగాణ-విలేకరులు
అంగన్‌వాడీ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తూ అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెట్టాలనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు అనేకమంది అంగన్‌వాడీలు ర్యాలీ తీశారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా తమ డిమాండ్లను పరిష్కరించాలని నినదించారు. పని చేయని సెల్‌ఫోన్లు మాకొద్దు అంటూ రోడ్డుపైనే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు సునీత మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు ఒకపూట బడితో పాటు మే నెలంతా టీచర్స్, హెల్పర్స్‌కు సెలవులివ్వాలని డిమాండ్ చేశారు. తమకిచ్చిన పనిచేయని సెల్‌ఫోన్లను తిరిగి అప్పగిస్తున్నామని అన్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఐసీడీఎస్ శాఖపై నిర్వహించిన సమీక్షలో శాఖకు బడ్జెట్ పెంచి, ఎలా బలోపేతం చేయాలనే అంశాలు చర్చించలేదని ఆరోపించారు. 48 ఏండ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారం కోసం తీసుకునే చర్యలపై చర్చించకుండా .. పేద ప్రజల కోసం నిరంతరం సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అవినీతిపరులని ఆరోపించడం అన్యాయ మన్నారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో కుటుంబ సర్వే చేయాలని అధికారులు చెప్తున్నారని, ఈ పనికి ఆటంకంగా ఉన్న అంశాలు పరిశీలించాలన్నారు. 24 రోజుల సమ్మె హామీలను వెంటనే అమలు చేయాలని, హెల్పర్స్‌కు పాత పద్ధతిలోనే ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అంగన్వాడీలు ధర్నా నిర్వహించి అనంతరం డీడబ్ల్యూవోకు వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీలు భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు వచ్చి మహా ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి .. కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ పీవోకు వినతిపత్రం అందజేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు ధర్నా నిర్వ హించారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి పవన్ కుమార్‌కి వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం ఐసీడీఎస్ పీడీకి వినతిపత్రం అందజేశారు. మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
హామీ ఇవ్వని ఐసీడీఎస్ అధికారులు
హైదరాబాద్‌లో అంగన్‌వాడీల భారీ ర్యాలీ
అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యల పరిష్కారానికి సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వలేద ని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూని యన్ ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంగ ళవారం ఐసీడీఎస్ డైరెక్టర్ కాంతి వెస్లీతో చర్చలు జరిపా మని తెలిపారు.ఈ చర్చల్లో ఎలాంటి స్పష్టమైన హామీ రాలే దని తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యా లయం నుంచి మైత్రివనం సిగల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించామని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ రాష్ట్ట్ర ఉపాధ్యక్షురాలు జీ కవిత, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజ్యలక్ష్మి, మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సునీత, శోభ హైదరాబాద్ సీఐటీయూ నాయకులు మహేందర్ రంగారెడ్డి జిల్లా సీఐటీయూ నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.