మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన గృహలక్ష్మి లబ్ధిదారులు బుధవారం తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ కాపీలను కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతూ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకంలో ఆర్థిక సహాయం కింద రూ.3లక్షల ప్రొసీడింగ్ మంజూరి ఇచ్చినట్లు లబ్ధిదారులు పేర్కొన్నారు. వీటిని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించి గృహలక్ష్మి పథకం రద్దును విరమించుకోవాలని కోరారు. లేనిపక్షంలో మాలాంటి పేద వారికి ముందుగా గుర్తించి ఇంటి నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై మాకు న్యాయం చేయాలని కోరుతూ తహసిల్దార్ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో నర్సాపూర్ సర్పంచ్ పెండ ప్రభాకర్, దొమ్మరి చౌడు తండా సర్పంచ్ భాస్కర్, గ్రామ గృహలక్ష్మి లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.