వైద్యసౌకర్యాల కుదింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

– కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల దేశవ్యాప్త మహా ధర్నాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యసౌకర్యాల కుదించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య సౌకర్యాల్లో కోత విధించడాన్ని నిరసిస్తున్న దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహించారు. రైల్వే, డిఫెన్స్‌, పోస్టల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, పారామిలిటరీ తదితర పెన్షనర్ల నేషనల్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్స్‌ (ఎన్సీసీపీఏ) నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) అదనపు డైరెక్టర్‌ (ఏడీ) కార్యాలయాల ఎదుట మంగళవారం భారీ ధర్నాలు నిర్వహించి ప్రధాన మంత్రి తదితరులకు వినతి పత్రాలు సమర్పించారు.హైదరాబాద్‌ బేగంపేటలో వందలాది మంది రిటైర్డ్‌ ఉద్యోగులు పాల్గొన్న ధర్నాలో ఎన్సీసీపీఏ డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌ పాలకుర్తి కష్ణమూర్తి మాట్లాడుతూ సీజీహెచ్‌ఎస్‌ ఎంప్యానెల్డ్‌ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అందించాలనీ, అదనపు మొత్తాలను డిమాండ్‌ చేసే విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీజీహెచ్‌ఎస్‌ వెల్‌ నెస్‌ సెంటర్లను పబ్లిక్‌ ప్రయివేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) పద్దతిపై ప్రయివేటీకరణ ప్రతిపాదనను విరమించుకోవాలని టాప్రా నాయకులు ఎన్‌.సోమయ్య విజ్ఞప్తి చేశారు. సీజీహెచ్‌ఎస్‌కు ఉద్యోగులు ప్రతి నెలా తమ జీతంలో చందా చెల్లిస్తున్నారనీ, రిటైరైన తర్వాత కూడా 120 నెలల సబ్సిక్రిప్షన్‌ చెల్లించారనీ, కానీ ఇప్పుడు ఆయుష్మాన్‌ భారత్‌తో లింక్‌ చేసి వైద్య సౌకర్యాలను కుదించాలనే నిర్ణయాన్ని రద్దు చేయాలని సీసీజీజీఓఓ జాతీయ చైర్మెన్‌ వి.కృష్ణ మోహన్‌ కోరారు. రైల్వే ఆస్పత్రుల్లో, సీజీహెచ్‌ఎస్‌లో నిపుణులైన వైద్యులను, పారామెడికల్‌, ఇతర సిబ్బందిని వెంటనే నియమించాలని ఏఐఆర్‌ఆర్‌ఎఫ్‌ అధ్యక్షులు స్వామి కోరారు. దేశవ్యాప్తంగా వేలాదిమందితో జరిగిన ధర్నాల్లో నాయకులు న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించనట్లైతే దశలవారీగా ఆందోళనలను ఉధృతం చేస్తామనీ, ఐక్య ఉద్యమాలతో కలిసికట్టుగా పోరాడి సమస్యలను పరిష్కరిం చుకుందామని పిలుపునిచ్చారు. ఈ మహాధర్నాలో సీనియర్‌ నాయకులు ఎంఎన్‌ రెడ్డి, ప్రభాకర్‌ నాయర్‌, బీజేఎం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.