ఢిల్లీ ఆర్డినెన్స్‌ అహంకారపూరితం

– బీఆర్‌ఎస్‌ నేత కేశవరావు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ వ్యవహారాల్లో ఎవరికి అధికారం ఉండాలనే దానిపై ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కాదని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురావడం అహంకారపూరితమని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
న్యాయమూర్తుల కంటే తమకే ఎక్కువ తెలుసు అనే ధోరణిలో కేంద్ర ప్రభు త్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ విషయం లో మా అభిప్రాయం ఇది మీరు ఏమంటారని ప్రతి పక్షాల అభిప్రాయాలు తీసుకొని ఉంటే బాగుండే దన్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అధికారాలు కట్ట బెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, తమిళనాడు గవర్నర్‌ ఓ మంత్రిని తొలగించిన తీరుపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ప్రశ్నించినట్లు తెలిపారు. ప్రతిపక్షాలు ఓ అంశాన్ని లేవనెత్తినప్పుడు దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే నన్నారు. తన పార్లమెంటరీ జీవితంలో అధికార పార్టీ యే ఆందోళనలు చేయడం ఈ ప్రభుత్వ హయాం లోనే చూస్తున్నానని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మణిపూర్‌ విషయంపై మాట్లాడితే బాగుంటుందని అన్నారు. బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశా నికి వెళ్లలేదంటే తాము బీజేపీతో ఉన్నట్లు కాదన్నారు. ఇండియా కూటమిలో ఉంటే బీజేపీకి వ్యతిరేకమని, లేకుంటే బీజేపీకి మిత్రులనేది ఏం లేదన్నారు. 26 పార్టీలు ఓ వైపు, 38 పార్టీలు మరో వైపు అనే లెక్కలు సరికాదని, సిద్ధాంతపరంగా ఎవరు ఎటు అనేది చూడాలని అన్నారు. ప్రజల అవసరాలు, సమస్యల పరిష్కారం ప్రాతిపదికగా బీఆర్‌ఎస్‌ వెళుతుంద న్నారు. ”కూటములు విఫల ప్రయోగాలు అని గతంలోనే రుజువైంది. ఇప్పుడు కావల్సింది సిద్ధాంతా లు తప్ప,కూటములు కాదు. అదే సమయంలో భిన్నత్వంలో ఏకత్వమనే భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్న ఇండియా ముసాయిదాను స్వాగతిస్తున్నాం” అని ఆయన అన్నారు.
మణిపూర్‌పై ప్రధాని ప్రకటన చేయాలి :నామా నాగేశ్వరరావు
మణిపూర్‌ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాల ని, ప్రధానమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్‌ చేసినట్లు బీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై గతంలోనూ లేవనెత్తా మని, ప్రస్తుతం ఈ విషయాన్ని సమావేశం ముందు ఉంచనున్నామని తెలిపారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు అడ్డుకోవడం, తమిళనాడులో ఓ మంత్రిని గవర్నర్‌ తొలగించిన తీరుపై చర్చించాలని కోరినట్లు చెప్పారు. రైతులు ఆందోళన చేసినప్పుడు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చట్టం చేస్తామని, వారిపై కేసులు మాఫీ చేస్తామని హామీ ఇచ్చినందున వాటిని నెరవేర్చాలని డిమాండ్‌ చేశామన్నారు.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, మహిళా రిజర్వేషన్‌ బిలు ఆమోదం, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు, కుల గణన చేపట్టాలని, రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణ కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అఖిలపక్ష సమావేశంలో డిమాండ్‌ చేసినట్లు నామా తెలిపారు. రాష్ట్రానికి రావల్సిన పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని కోరినట్లు ఆయన చెప్పారు.