
– సిఆర్పిఎఫ్ నీడలో గోదాములు
– ఎన్నికల పరిశీలకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ల సీజ్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లా లోక్ సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ లో పోలైన ఈవీఎంలను నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచారు. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలన్నింటిని అనుశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఆయా నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ సమక్షంలో, రాజకీయ పార్టీల ప్రతినిధులు, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు హాజరుకాగా, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన, జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో ఈవీఎంలను భద్రపరిచారు.ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములతో పాటు, దుప్పలపల్లి గోదాం మొత్తం పూర్తిగా సిఆర్పిఎఫ్ భద్రత, పోలీస్ భద్రతలో ఉంది. సోమవారం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయా అసెంబ్లీ నియోజక వర్గాల వారిగా ఈవీఎంలు అన్ని దుప్పలపల్లి గోదాం కు చేరుకోగా వాటన్నిటినీ స్ట్రాంగ్ రూములలో ఉంచి ఎన్నికల పరిశీలకుల సమక్షంలో వాటికి సీల్ చేసారు. సీజ్ చేసే సమయంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ తో పాటు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, నల్గొండ,సూర్యాపేట జిల్లాల ఆర్డీవోలు, అడిషనల్ ఎస్పి రాములు, జిల్లా రెవెన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి, పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ కోటేశ్వరరావు,డిఆర్డిఓ నాగిరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు సంగీతలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్న, డిఎస్పి శివరామిరెడ్డి, జిల్లా అధికారులు, ఎలక్షన్ విభాగం సూపరింటిండెంట్ విజయ్, చంద్ర వదన, తహసిల్దారులు, తదితరులతో పాటు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి శంకర్ నాయక్, బిఆర్ఎస్ నుండి పంకజ్ యాదవ్, బిజెపి నుండి నూకల నరసింహారెడ్డి, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గోలి సైదులు, చోలేటి ప్రభాకర్, సిరిశాల సీనయ్య, స్వతంత్ర అభ్యర్థుల తరఫున వారి ప్రతినిధులు యాదగిరి, నరసింహ తదితరులు ఉన్నారు.