చేసిన అభివృద్ధే ప్రతిపక్షాలపై పాశుపతాస్త్రం

– ఇచ్చిన హామీలు నెరవేర్చడమే మా విశ్వసనీయత : కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదేండ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు అందించిన అభివృద్ధిని పాశుపతాస్త్రంగా మార్చుకొని ప్రతిపక్షాలపై విజయం సాధిస్తామని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయిన నేపథ్యంలో ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన మా విశ్వసనీయతనే ఈ ఎన్నికల్లో తమ విజయ మంత్రంగా మారుతుందని చెప్పారు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌ రికార్డు సృష్టించబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. రాష్ట్రంలో గాంధీ సిద్ధాంతమే తప్ప గాడ్సే సిద్ధాంతాలు నడవవని స్పష్టం చేశారు. ఈసారి వంద ఎమ్మెల్యే స్థానాలు గెలిచి పాత రికార్డును బీఆర్‌ఎస్‌ పార్టీ తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేశారు.