ఉద్యోగుల కృషి ఫలితమే విద్యుత్‌ సంస్థల అభివృద్ధి

– టీఎస్‌పీఈ జేఏసీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీశ్‌రెడ్డి
– రిటైర్మెంట్‌ ఇవ్వండి : టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్వరాష్ట్రంలో విద్యుత్‌ సంస్థల అభివృద్ధికి ఉద్యోగుల చేసిన కృషి ఎనలేనిదనీ, దాన్ని ప్రభుత్వం ఎప్పుడూ గుర్తిస్తూనే ఉంటుందని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీఎస్‌పీఈజేఏసీ) ఆధ్వర్యంలో బుధవారంనాడిక్కడి ఎర్రగడ్డ టీఎస్‌జెన్‌కో ఆడిటోరియంలో జరిగిన విద్యుత్‌ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో రాష్ట్రం నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్నదనీ, ఫలితంగా రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందన్నారు. గతాన్ని మర్చిపోకూడదనీ, పరాయి పాలనలో కరెంటు కోసం ఎన్ని గోసలు పడ్డామో ఇప్పటి పిల్లలకు తెలియదని వివరించారు. సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ వెలుగుల కోసం తాము పడిన కష్టం ఫలించిందనీ, దీన్ని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. సుదీర్ఘకాలం సంస్థ సీఎమ్‌డీగా పనిచేశాననీ, వయోభారం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నాననీ తెలిపారు. తాను రిటైర్‌ అవుతానని ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రులకు నేరుగా చెప్పలేకపోతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. విద్యుత్‌ ఉద్యోగులు, ముఖ్యమంత్రి కేసీఆర్‌, తనతోటి సీఎమ్‌డీలతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో డిస్కంల సీఎమ్‌డీలు జీ రఘుమారెడ్డి, ఏ గోపాలరావు, టీఎస్‌పీఈజేఏసీ చైర్మెన్‌ సాయిబాబా, కన్వీనర్‌ పీ రత్నాకరరావు, కో-చైర్మెన్‌ శ్రీధర్‌, కో-కన్వీనర్‌ బిసి రెడ్డి, వైస్‌ చైర్మెన్‌ వజీర్‌, శ్యామ్‌ సుందర్‌, తులసీ నాగరాణి, ఫైనాన్స్‌ సెక్రెటరీ కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి, సీఎమ్‌డీలను ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.