బాసర పుణ్యక్షేత్రంలో పులకించిన భక్తజనం

– అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్
– వేడుకగా అక్షరాభ్యాస పూజలు
నవతెలంగాణ -ముధోల్ 
బాస‌ర పుణ్య‌క్షేత్రంలో వ‌సంత పంచ‌మి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. రెండు రోజు ఉత్స‌వాలు సంద‌ర్భంగా సోమ‌వారం సరస్వతి అమ్మ‌వారికి నిర్మ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ అభిలాష అభిన‌వ్ ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. చ‌దువుల త‌ల్లీ అనుగ్ర‌హం కోసం పిల్ల‌ల‌తో అక్ష‌రభ్యాస పూజ‌లు చేయించారు. బాస‌ర పుణ్య‌క్షేత్రంలో వ‌సంత పంచ‌మి శోభ సంత‌రించుకోవ‌డంతో భ‌క్త‌జ‌నం పుల‌కించింది. తెలంగాణ‌లోని వివిధ ప్రాంతాల‌తోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస‌గ‌ఢ్ రాష్ట్రాల నుంచి వ‌చ్చిన భ‌క్తులు అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.
ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన క‌లెక్ట‌ర్‌
వ‌సంత పంచ‌మి ఉత్స‌వాల్లో భాగంగా చ‌దువుల త‌ల్లీ స‌ర‌స్వ‌తికి నిర్మ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ అభిలాష అభిన‌వ్ ప్ర‌భుత్వం త‌రుఫున ప‌ట్టు వ‌స్త్రాలు తీసుకొచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌ ఆమెకు ఆర్డీఓ కోమ‌ల్ రెడ్డి, ఆల‌య చైర్మ‌న్ శ‌ర‌త్ పాట‌క్‌, ఆల‌య అధికారులు, అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. ఆల‌య మ‌ర్యాదాల‌తో మంగ‌ళ‌వాయిద్యాల‌తో క‌లెక్ట‌ర్ ను  ఆల‌యం లోప‌ల‌కు తీసుకు వెళ్లారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుఫున తీసుకు వ‌చ్చిన ప‌ట్టు వ‌స్త్రాల‌ను అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆలయంలో అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.
వేడుక‌గా అక్ష‌రాశ్రీ‌కారం
అమ్మవారి జన్మదినం సందర్భంగా అక్షర శ్రీకార పూజ‌లు వేడుక‌గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారు జాము నుండే క్యూ లైన్ లో భక్తులు, చిన్నారులు బారులు తీరారు. తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయ సన్నిధిలో ప్రత్యేక అక్షరాభ్యాస పూజలను అర్చకులు ప్రారంభించారు. అక్షరాభ్యాస పూజలకు రెండు గంటల సమయం పట్టింది.
మేథా దక్షిణమూర్తి హోమం
అమ్మవారి సన్నిధిలో ఉదయం ఏడు గంటలకు అర్చకులు, వేద పండితులు చండి హోమం, మేథా దక్షిణామూర్తి హోమం
 నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ప‌వార్ రామారావు ప‌టేల్ పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. వసంత పంచమి సందర్భంగా వివిధ ప్రాంతల నుండి భారీగా వాహనాల్లో తరలివచ్చిన భక్తుల రద్దీ తో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వ‌ర్యంలో ట్రాఫిక్ ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించారు. బందోబస్తును నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేకంగా దగ్గరుండి పర్యవేక్షించారు.