తేడా…!?

తేడా...!?డిమాండ్లలో తేడా గురించి మాత్రమే కాదు. రెండు ఆలోచనా ధారల్లో తేడా. రెండు సైద్ధాంతిక ధోరణుల్లో తేడా. ”క్షీర నీర న్యాయం” లాగా ఇటీవలి కాలంలో కమ్యూనిస్టుల, ఇతర బూర్జువా పార్టీల విధానాలను ఇంత స్పష్టంగా బయటపెట్టిన ఘటన మరొకటి కానరాదు. మన సింగరేణి బొగ్గు గనుల వేలం రద్దు చేయాలంటాయి కమ్యూనిస్టు పార్టీలు. వేలంపాటకు సై అంటూనే మా గనులు మాకేదక్కాలంటాయి బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు. ఒకటి ప్రభుత్వ రంగాన్ని కాపాడాలనేది, రెండవది ప్రభుత్వ రంగాన్ని తెగనమ్మాలనేది.
ఈ ఆశ్చర్యకర పరిణామాన్ని చూస్తే భారత గుత్త పెట్టుబడిదారులు తమ లాభాల్ని పెంచుకోవడానికీ, తమ బొక్కసాల్ని నింపుకోవడానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాల ఫలితమే ఇదంతా అని అర్థమవుతుంది. ఇందిరాగాంధి తన పాలన చివర్లో, అంటే 1984 అక్టోబర్‌ మొదట్లో ఐఎమ్‌ఎఫ్‌ నుండి దిగుమతి చేసుకున్న డాక్టర్‌ అర్జున్‌ సేన్‌గుప్తాను ”ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏవిధంగా సంస్కరించాలో” చెప్పమని సలహా అడిగింది. ”కోర్‌” సెక్టార్‌ తప్ప ఈ దేశంలో ప్రభుత్వరంగం అవసరం లేదని సదరు డాక్టర్‌జీ ప్రిస్క్రిప్షన్‌ ఇచ్చేసి వాషింగ్టన్‌ విమానమెక్కేశాడు. వాస్తవానికి ఆయన తన యజమాని (ఐఎంఎఫ్‌) ఆశించినట్టు, సారీ, ఆదేశించినట్టే చేశాడు. కానీ 2022 – 25 మధ్య రూ. 6 లక్షల కోట్లు ఈ కోర్‌ నుండే తెగ నమ్మడానికి నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌ లైన్‌ (ఎన్‌ఎంపీ) వేసింది మోడీ సర్కార్‌.
ఈ లిస్టులో బొగ్గు, విద్యుత్‌, టెలికం, రోడ్లు, హైవేలున్నాయి. అనేక ఇతర ఖనిజాలున్నాయి. వేర్‌హౌసులున్నాయి. ఆశ్చర్యమేమంటే వీటిల్లో ఇప్పటికే అంబానీ, అదానీలున్నారు. ఎల్‌అండ్‌టి వంటి వారి దోస్తులనేకు లున్నారు. ప్రజలకవసరమైన మౌలిక రంగమంతా ప్రజల చేతుల్లోనే ఉండాలని, అంటే ప్రభుత్వమే అందించాలనేది ”పాత చింతకాయ పచ్చడి” సిద్ధాంతం. ప్రభుత్వం చేసే పనంతా ప్రయివేటు వారి చేతుల్లో పెట్టేసి, అది చదువులైనా, ఆసుపత్రులైనా, ఏ సేవలైనా అమ్ముకోవచ్చనేది మార్గరేట్‌ థాచెర్‌ (1979-90లో బ్రిటీష్‌ ప్రధాని) సిద్ధాంతం. రైళ్ళని, నదుల్నీ, కరెంటును, విద్య, వైద్యాన్ని ఆమె ప్రయివేటీకరించింది. నరకం అంటే ఎక్కడుంటుందంటే బ్రిటన్‌ రైల్వే వ్యవస్థలో ఉంటుందన్న నానుడి ఉనికిలో కొచ్చింది. ప్రస్తుతం బ్రిటన్‌ ప్రభుత్వమే రైల్వేలను నడుపుతున్నది. ఇటీవలి ఫ్రంట్‌ లైన్‌లో సిపి చంద్రశేఖర్‌ ”కొలాప్స్‌ ఆఫ్‌ నియోలిబరల్‌ ప్రయివేటైజేషన్‌”లో థేమ్స్‌ నదిని కాంట్రాక్టుకు తీసుకున్న సంస్థ ‘థేమ్స్‌ వాటర్‌’ బుడుంగున మునిగిందని రాశారు.
ఘనత వహించిన భారత పాలకులకివేవీ పట్టవు. ఈ నేపథ్యంలో ”నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌ లైన్‌”లో భాగంగా బొగ్గు గనుల ప్రయివేటీకరణను చూడాలి. ఇది ఒక రచయితన్నట్లు ”అమ్మకుండా సొమ్ము చేసుకోవడం, కొనకుండా కొల్లగొట్టు కోవడం” ఇదే ఈ పైప్‌ లైన్‌ ఘనత.
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు జనాన్ని ఏమర్చడానికి మాటల మిసైల్స్‌ విసురుకుంటున్నారు. గతంలో వేలం జరిగితే కేసీఆర్‌ తొడగొట్టి సవాల్‌ అన్నారు. ఆనాడు వేలంలో కోయగూడెం, సత్తుపల్లి ఓపెన్‌ కాస్ట్‌ మైన్స్‌ పొందినవారు బీఆర్‌ఎస్‌కు దగ్గరివారనే ప్రచారం గుప్పుమంది. బీఆర్‌ఎస్‌కు ఎలక్టోరల్‌ బాండ్స్‌ ఇచ్చిన పెద్దలూ వీరేనన్న సంగతి ఆ తర్వాత బయటపడిందనుకోండి. తాము సింగరేణి రక్షణ కోసం నిలబడినట్టు చెప్పుకుంటే చెల్లుబాటుకాదు. మన రాష్ట్రం నుండి లోక్‌సభకు ఎన్నికై బొగ్గుగనుల శాఖా మంత్రిగా వెలిసిన వ్యక్తిగాని, మిగిలిన బీజేపీ పార్లమెంటు సభ్యులుగాని అసలు గనుల వేలాన్ని తప్పుపట్టిన పరిస్థితిలేదు. పార్లమెంటులో నోరువిప్పిన పరిస్థితీ లేదు. కాంగ్రెస్‌, ఎంఐఎంల సభ్యులూ తొమ్మిది రోజుల లోక్‌సభలోనూ ఉలికింది లేదు.. పలికింది లేదు.
పైన చెప్పిన వివరాలన్నీ చూసిన తర్వాత మోడీసాబ్‌ ప్రారంభించిన ఈ మహాయజ్ఞం ‘నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌’ అంటే మన దొడ్లో బోర్‌ వేసుకుని కార్పొరేట్లు తమింట్లోకి తోడిపోసుకోవడం ఆగకుండా సింగరేణి మనగలుగుతుందా? కోలిండియా, ఈస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్స్‌ వంటివి వేలంలో అదానీ ఎగరేసుకుపోతుంటే సింగరేణి ఒక్కటే బతికి బట్టకలదా? సింగరేణిని రక్షించాలనుకునే రాష్ట్ర కాంగ్రెస్‌ సర్కార్‌ బీజేపీ విధానాలపై పోరాడటానికి ఏమి కృషి చేసింది? అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్ళవచ్చుకదా? సింగరేణి కార్మికుల్ని కదిలించడానికి, రాష్ట్ర ప్రజల్ని ఈ సమస్యపై పోరాటోన్ముఖుల్ని చేయటానికి చేసిన కృషి నాస్తి. మా ‘శ్రావణపల్లి’ మైన్‌ మాకే ఇవ్వాలంటే ఫలితం ఏమైనా ఉంటుందా?
దీనికి భిన్నంగా కమ్యూనిస్టులు సూత్రబద్ధమైన వైఖరి తీసుకున్నారు. నాయకులు కదిలారు. కార్యకర్తల్ని కదిలించారు. జిల్లా కలెక్టరేట్ల నుండి సింగరేణి భవన్‌ వరకు తమ పోరాటాన్ని విస్తరించారు. మోడీ 3.0లో ప్రయివేటీకరణలు పూర్తి స్థాయిలో జరిగేలా వున్నాయి. ఆ విధానాలను వ్యతిరేకించకుండా, ప్రజల్ని కదిలించకుండా విజ్ఞప్తులు చేస్తే ఉపయోగం ఉండదు. తెలంగాణ కొంగుబంగారం సింగరేణి ప్రభుత్వ ఆధ్వర్యంలో మిగలదు.