పోడు పట్టాల పంపిణీ వారంలో పూర్తిచేయాలి

– వృత్తిదారుల ఆర్థిక సహాయం దరఖాస్తులు పరిశీలించండి : కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. సోమవారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పోడు భూముల పట్టా పంపిణీ పురోగతిని సమీక్షించారు. గృహలక్ష్మి పథకం, ఎరువులు, విత్తనాల నిల్వలు, తెలంగాణకు హరితహారం, బీసీ చేతివత్తుల వారికి ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ పథకం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం తదితర అంశాలపై ఆమె కలెక్టర్లను అడిగి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వానా కాలం సీజన్‌లో పోడు పట్టాల లబ్ధిదారులకు రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను వారంలోగా పూర్తిచే యాలని అదేశించారు. పోడు రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను రైతు బంధు పోర్టల్‌లో జమ చేయాలని, రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖలు సమన్వ యంతో పనిచేయాలని,తాజాగా చెట్లను నరికివేయకుండా చర్యలు తీసుకో వాలని చెప్పారు.ఎరువులు, విత్తనాల నిల్వలపై కలెక్టర్లు రోజువారీ సమీక్ష నిర్వహించాలన్నారు.కలెక్టర్లు రైస్‌ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి, వాటి పనితీరు సామర్థ్యాన్ని పరిశీలించాలనీ, మిల్లుల్లోని స్టాక్‌ పొజిషన్‌ను తనిఖీ చేయాలని ఆదేశించారు. బీసీ చేతివృత్తిదారులకు ఆర్థిక సహాయం కింద అందిన దరఖాసు ్తలన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బీ వెంకటేశం, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, పంచాయత్‌ రాజ్‌ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రోడ్లు, భవనాల కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తు, ఎస్సీ డెవలప్‌మెంట్‌ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం.డోబ్రియాల్‌, పౌరసరఫరాల కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.