ఘనంగా ముగిసిన జిల్లా స్థాయి సీ.ఎం కప్-2023 పోటీలు

– రాష్ట్ర స్థాయిలోనూ ప్రతిభ చాటాలి  జెడ్పి చైర్మన్
నవతెలంగాణ కంఠేశ్వర్
జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గత మూడు రోజుల పాటు కొనసాగిన సీ.ఎం కప్-2023 జిల్లా స్థాయి క్రీడా పోటీలు బుధవారం సాయంత్రం ముగిసాయి. అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో గెలుపొందిన క్రీడాకారులకు, క్రీడా జట్లకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకాలతో పాటు మెమోంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా, జెడ్పి చైర్మన్ విట్ఠల్ రావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, వారి ప్రతిభను వెలికి తీయాలనే సంకల్పంతో ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తోందని అన్నారు. ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవితంలో క్రీడలను భాగంగా మలుచుకోవాలని సూచించారు. సృజనాత్మక శక్తిని పెంపొందిస్తూ శారీరక దారుఢ్యాన్ని అందించడంలో క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. జిల్లాకు చెందిన నిఖత్ జరీన్, హుస్సాముద్దీన్, యెండల సౌందర్య, గుగులోత్ సౌమ్య, పుల్లెల గోపీచంద్ వంటి అనేక మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడాకారులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు జరుగనున్న రాష్ట్ర స్థాయి క్రీడల్లోనూ సత్తా చాటాలన్నారు. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థినీ, విద్యార్థులు, యువతలో విశేషమైన ప్రతిభా పాటవాలు దాగి ఉంటాయన్నారు. వారి ప్రతిభను వెలికి తీసేందుకు ఈ తరహా క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. క్రీడలతో పాటు చక్కగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని సూచించారు. యువత తమకు నచ్చిన రంగంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని సరైన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రతిభ నెలకొని ఉంటుందని, దానిని సరైన రీతిలో వినియోగించుకున్న వారే విజేతలుగా నిలుస్తారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ అద్భుతమైన ప్రతిభను కనబరిచి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తన్న, బాక్సింగ్ కోచ్ సంసాముద్దీన్, అంతర్జాతీయ బాక్సర్ హుస్సాముద్దీన్, క్రీడా సంఘాల ప్రతినిధులు, పీ.డీలు, పీ.ఈ.టీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.