– ఐ.డీ.ఓ.సీలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
నవతెలంగాణ- కంటేశ్వర్
నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ముందుగా న్యూ ఇయర్ కేక్ కట్ చేసి సంబరాలకు శ్రీకారం చుట్టారు. అధికారులు, అనధికార ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల బాధ్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు తదితరులు జిల్లా కలెక్టర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు కలెక్టర్ ను కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. నూతన సంవత్సర సంబరాలతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకటించారు. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని, అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని, పంటలు సమృద్ధిగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, జిల్లాను మరింత సుసంపన్నం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కలెక్టర్ ను కలిసిన వారిలో జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, వినోద్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఆయా శాఖల జిల్లా అధికారులు సింహాచలం, జయసుధ, యోహాన్, రమేష్, డాక్టర్ సుదర్శన్, రవీందర్, వాజిద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. అలాగే టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, పెన్షనర్ల సంఘం ప్రతినిధులు, సీనియర్ సిటిజన్స్ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తాహెర్ బిన్ హందాన్ నేతృత్వంలో ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గం, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు ఆంజనేయులు, తోట రాజశేఖర్, బాపూజీ వచనాలయం కమిటీకి చెందిన భక్తవత్సలం తదితరులు కలెక్టర్ ను కలిసి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారు. స్నేహ సొసైటీ చిన్నారులతో కలిసి కలెక్టర్ ప్రత్యేకంగా కేక్ కట్ చేసి వారికి తినిపించారు. స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, లయన్స్ క్లబ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తదితర సంఘాల ప్రతినిధులు కలెక్టర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులకు దుప్పట్లు, నోట్ బుక్కులు అందజేత…
కాగా, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన అధికార, అనధికార ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు అందించిన దుప్పట్లు, నోట్ బుక్కులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్వీకరించి, వాటిని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అందజేశారు. పూల బొకేలకు బదులుగా పేద విద్యార్థులకు అందించేందుకు వీలుగా బ్లాంకెట్లు, నోట్ బుక్కులు తేవాలని జిల్లా కలెక్టర్ చేసిన విజ్ఞప్తికి విశేష స్పందన లభించింది. పాలనాధికారిని కలిసేందుకు వచ్చిన వారందరు పెద్ద ఎత్తున దుప్పట్లు, నోట్ బుక్కులు తీసుకురాగా, కలెక్టర్ వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర సంక్షేమ శాఖల అధికారులకు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా విద్యార్థులకు తోడ్పాటును అందించిన వారందరికీ జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వసతి గృహాల విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని, ప్రత్యేకించి ప్రస్తుత చలికాలం బారి నుండి కాపాడుకునేందుకు దుప్పట్లు ఉపయుక్తంగా నిలుస్తాయని పలువురు హర్షం వెలిబుచ్చారు.