
– నేడే ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ – కోహెడ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నేడు ఇందిరమ్మ సొంతింటి కలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో నిరుపేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తెచ్చిన ఆరు గ్యారంటీలలో ఇందిరమ్మ ఇండ్లు కూడ ఒకటి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో మరో పథకాన్ని ప్రభుత్వం అమలు చెసేందుకు ముందుకు వచ్చింది. తొలిదశలో సొంత జాగ ఉన్నవారికి రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వడం రానున్న రోజులలో ఇంటి స్థలం లేనివారికి సొంత జాగను ఇచ్చి ఆర్థికసాయం చెసేందుకు ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం. అలాగే గత బీఆర్‌ఎస్ పాలనలో డబుల్‌బెడ్‌రూం ఇండ్లను మంజూరి చేసినప్పటికి మండలంలో ఒక్క ఇంటినైనా నిర్మించలేకపోయింది. శనిగరం, ఆరెపల్లి గ్రామాలలో నిర్మించేందుకు చర్యలు తీసుకున్నప్పటికి పలు సమస్యలతో అవి అర్ధంతరంగానే ఆగిపోయాయి. సొంత ఇల్లు లేక పూరి గుడిసెలలో నివసిస్తున్న నిరుపేదలకు ఇంటి నిర్మాణం అందని ద్రాక్షగానే మిగిలింది. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇండ్లను నేడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నందున మండలంలో నిరుపేదలైన వారికి అందాలని పలువురు కోరుకుంటున్నారు. అయితే లబ్దిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనేది నేడు తేలాల్సిఉంది. అలాగే గతంలో ఇందిరమ్మ ఇండ్లు పొందని వారు, సొంత జాగ ఉండి ఎలాంటి ఇంటి నిర్మాణం చేయనివారు, డబుల్ బెడ్‌రూం ఇండ్లు పొందని వారిని పరిగణలోకి తీసుకోవాలని గైడ్‌లైన్స్‌లో తెలుస్తుంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ప్రభుత్వం రూ.5 లక్షలను అందిస్తున్నందున లబ్దిదారులు తమ ఇష్టం వచ్చిన రీతిలో సొంతింటిని నిర్మించుకునే అవకాశం ఉంది. అలాగే మండలంలో గత పది సంవత్సరాలుగా ఒక్క డబుల్‌బెడ్‌రూం అందని పరిస్థితి ఉన్నందున రవాణశాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గానికి రానున్న 3500 ఇండ్ల నిర్మాణంలో కోహెడ మండలానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.