– సమస్యలపై పోరాటాల ద్వారానే ప్రజా మద్దతును పొందగలుగుతాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం
మతోన్మాద శక్తుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవటమే నేడు కమ్యూనిస్టుల ప్రధాన కర్తవ్యంగా ఉండాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొమ్ము శ్రీను అధ్యక్షతన జరిగిన పాలేరు నియోజకవర్గం జనరల్ బాడీ సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. దేశంలో మతోన్మాదశక్తులు రాజ్యాంగాన్ని మార్చేందుకు, అసలు రాజ్యాంగమే లేకుండా మనువాదాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని, దాన్ని తిప్పికొట్టడం కమ్యూనిస్టుల ప్రధాన కర్తవ్యంగా ఉండాలన్నారు. ఒకవైపు మతోన్మాద శక్తులను ఎదుర్కొంటూనే మరోవైపు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని, పోరాటాలతోనే ప్రజా మద్దతును పొందగలుగుతామని స్పష్టంచేశారు. ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కార్యకర్తలు అహర్నిశలు పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని దోచుకుంటున్న బీజేపీ.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పక్కదారి పట్టించేందుకు అనేక రకాలుగా మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నదని, ఆ రాజకీయాల్లో పడి దేశ ప్రజలు మోసపోవద్దన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేశాకే ఓటు అడగాలని ప్రజా ప్రతినిధులను ప్రశ్నించాలని తెలిపారు. వేసవి తీవ్రతతో నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నందున ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీల అమలులో అవకతవకలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్, నండ్ర ప్రసాద్, ఊరడి సుదర్శన్ రెడ్డి, గొడవర్తి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి ఎడవల్లి రమణారెడ్డి, మండల నాయకులు అంగిరేకుల నరసయ్య, వశపొంగు వీరన్న, తుళ్లూరు నాగేశ్వరరావు, దాసరి మహేందర్, బింగి రమేష్, మల్లెల సన్మతరావు, తదితరులు పాల్గొన్నారు.