ద్వేషంతో రగులుతున్న దేశంలో ప్రేమను అందించటమే కాంగ్రెస్‌ విధి

నవతెలంగాణ-జహీరాబాద్‌
వివిధ వర్గాల మధ్య ద్వేషంతో రగులుతున్న దేశంలో ప్రేమను అందిం చడమే కాంగ్రెస్‌ పార్టీ విధిగా మలుచుకున్నదని ఏఐసీసీ నాయకులు డాక్టర్‌ షకిల్‌ అహ్మద్‌ ఖాన్‌ అన్నారు. సోమవారం జహీరా బాద్‌ పట్టణానికి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి ఉజుమ షేక్‌తో కలిసి మాట్లాడారు. కుల, మత, ప్రాంత, భాష, విభిన్న వర్గాల ప్రజల మధ్య విద్వేషాన్ని రగిలించి అక్రమంగా అధికారాన్ని సంపాదించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్వేష రాజకీయాలను చేస్తున్నదన్నారు. విద్వేష రాజకీయాలను రూపుమాపి దేశ ప్రజలకు ప్రేమ, స్నేహం అనే హస్తాన్ని అందించి దేశంలో శాంతి, సామరస్యాలను స్థాపించడానికే కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పని చేస్తున్నదన్నారు. మతతత్వ, కులతత్వ బీజేపీ విద్వేష రాజకీయాలను పారద్రోలి దేశంలో సామరస్యాన్ని సాధించాలంటే దేశ ప్రజలంతా ప్రజా స్వామ్య విలువలను గౌరవించే కాంగ్రెస్‌ పార్టీ వెంట నిలవాల న్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ మద్దతుగా పనిచేస్తున్నదన్నారు. తెలంగాణలో ప్రభుత్వం మైనార్టీలకు ఇస్తానన్న 12 శాతం రిజర్వేషన్లు మరిచిపోయిందని, జుడిషియల్‌ పవర్‌, త్రిబుల్‌ తలాక్‌, మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయన్నారు. అందువల్ల మైనార్టీలకు అండదండగా నిలుస్తున్న కాంగ్రెస్‌ పార్టీని, ఇండియా కూటమిని బలపరిచి గెలిపించాలన్నారు. ఉద్యమ సమయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏదైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. కాగా చరిత్రను మలిచే విధంగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే సీడబ్ల్యూసీ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించి.. ఇక్కడ చేపట్టే కార్యక్రమాలకు దిశా నిర్దేశం చేశారన్నారు. తమ ప్రభుత్వం హామీ ఇస్తే ఆచరణలో అమలు చేసే ప్రభుత్వమని.. ఇందుకు రాజస్థాన్‌, కర్ణాటక రాష్ట్రాలలో కేవలం రూ.500కే సిలిండర్‌తో పాటు వివిధ పథకాలను విజయవంతంగా కొనసాగించడమే నిదర్శన మన్నారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా తమ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, సమన్వయ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, నాయకులు గిరిధర్‌ రెడ్డి ,నరసింహారెడ్డి, బుల్లి కిషన్‌, భాస్కర్‌ రెడ్డి ,ముల్తాని, రాములు, భాస్కర్‌, నర్సింలు, కాజా మియా, అశోక్‌ అప్పారావు, రాములు యాదవ్‌ , హర్షద్‌ పటేల్‌, తదితరులు పాల్గొన్నారు.