వాడు
కడుపు మాడుతున్నా
కలలకు రంగులు అద్ది
మానం కాపాడు వస్త్రం
ఆ మూల మీది ముసలి తాత
చెప్పులు కుట్టి పాదాలకు పరువు తొడిగినట్టు
బికినీలు సిగ్గుపడు ఆరు గజాల నేత
వాడు దేశ గౌరవం
గర్వంగా తలెత్తుకొని నిలబడు జెండా వాడు
వాడు ఏ శిలలో ఏ శిల్పం ఉన్నదో కనిపెట్టే
శిల్పి చాతుర్యం
ఏ పోగు ఎటు తిప్పితే
ఏ బొమ్మ దిగుతుందో
మంత్రం తెలిసిన విద్య
ఆమె రాట్నమయ్యి చేయి కలిపిన
ఏడు రంగుల నేతబొమ్మ
నిత్యం శిశిరం అనుభవిస్తూ
వసంతం పంచిపెట్టు సంబరం
దు:ఖం దాచుకుని
నవ్వులు పంచుకునే సంతోషం
తాజ్ మహల్ కట్టినా
సొంత ఇల్లు లేని తాపీ మేస్త్రీ లాగే
ఎంత బట్ట నేసినా వొంటిని దాచుకోవడం చేతకాని
నష్ట జాతకం
వాడిపోయే పూల నవ్వులకు తేనె పూసినట్టు
బొబ్బలెక్కిన అరికాళ్ళకు వెన్న రాసినట్టు
కళకు కలలు ముడేసి
ఎప్పుడో తప్పిపోయిన బ్రతుకు మూట
ఎంత వెతుకుతున్నా
కడుపునిండు ఆశలు
బజారు మీది దళారి పాలు
వాడు ముల్లు పదును అంచు మీద నిలబడి
నవ్వులు పూయించువాడు
కన్నీళ్ళు తోడుకుని
పన్నీటి కాలువలు తవ్వుతున్న వాడు
ఆకలి కూనిరాగం ఎత్తుకున్నట్టు
మగ్గం గొంతు సవరించుకుని
కోకిల పిలుస్తున్నట్టు
పాల కొరకు పిల్లాడు ఏడుస్తున్నట్టు
ఒంటిమిది జీర్ణవస్త్రం
నేతపాట ఆలపించే పాటగాడు
వాడు ఫ్యాషన్ వేదికపై అగుపడని పాత్రధారి
అందరికీ అయిన వాడే అయినా
సెల్లు టవర్ల నడుమఆగమయిన పిట్ట వాడు
మరమగ్గాల దాడిలో
కాలు రెక్కలు విరిగిపోయిన క్షతగాత్రుడు
దు:ఖపు నీడ, కన్నీటి చార
ఏ ఆనవాలు దొరకని
చిరునవ్వుల రారాజు
వాడు మగ్గం మీది సీతాకోకచిలుకలు
దేశ దేశాలకు ఎగరేసే ఇంద్రజాలం
బట్ట కేడ్చినా పొట్ట కేడ్చినా
బ్రతుకు పూల తోటలో
నేత పోగుల కలల సాగుకు
అంకితమయిన వాడు
వాడు దేశానికి ఎంత చిన్న చూపు అయినా
వస్త్ర ప్రపంచానికి ఉదయించిన సూర్యుడు
గ్రహణం తాత్కాలికం.
– గజ్జెల రామకృష్ణ, 8977412795