రాజకీయాలు ఎప్పుడూ ఒకతీరున ఉండవు అని తరచుగా అందరూ అంటుంటారు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం రాజకీయాల్లోనే జరుగుతుంటుంది. ప్రధానంగా తెలంగాణలో ఇవి సర్వసాధారణమే. ఎమ్మెల్యేలు ఓడి ఎంపీలుగా గెలిచి చరిత్ర సృష్టించిన నేత లు సైతం ఉన్నారు. కాగా బీఆర్‌ఎస్ తాను ప్రవేశపెట్టిన విధానాన్నే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అమలుచేస్తుండటం గమనార్హం. మాజీ సీఎం కేసీఆర్ గతంలో టీడీపీని ‘ఖతం’ చేశారు. రాజకీయ చదరంగాన్ని రంజుగా నడిపించారు. అప్పట్లో ఇప్పటి సీఎం రేవంత్ టీడీపీ నేతగా ఉన్న ముచ్చట అందరికి ఎరుకేనాయే. కాగా ఇప్పుడు బీఆర్‌ఎస్ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ గెలిచి సీఎం రేవంత్ అదే చదరంగం ఆటకు పావులు కదుపుతున్నాడు. ‘నీవు నేర్పిన విద్యయే నిరజాక్షా’ అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ గంపలో కమ్మేసుకుంటున్నారు. ఇంకా ఆ గేమ్ నడుస్తూనే ఉంటుంది. ఇయ్యాల్నో, రేపో మరికొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి లైన్‌కట్టే అవకాశముందని తాజా పరిణామాలు చెప్పకనే చెబుతు న్నయి. బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా తయారైంది రాజకీయ పరిస్థితి. చెరపకురా చెడెదవు అన్న నానుడి అందరికీ తెలిసిందే కదా!
– బి. బసవపున్నయ్య