ఇటీవల కన్నుమూసిన మార్క్సిస్టు మేధావి సీతారాం ఏచూరి మన దేశాన్ని అందమైన ఒక పూల బొకేతో పోల్చారు. రంగురంగుల పూలన్నీ ఒక చోట చేరి, ఆ బొకేకి అందాన్ని చేకూర్చినట్టు…భారతంలో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాలు, రకరకాల భాషలు, పలురకాల సాంప్రదా యాలు… వెరసి మరేదేశంలో లేని విధంగా మన దగ్గర భిన్నత్వంలో ఏకత్వమనేది శతాబ్దాలుగా పరిఢవిల్లుతోందని ఆయన నొక్కి వక్కాణిం చారు. అదే కోవలో మహత్తర, వీరోచిత సాయుధ రైతాంగ పోరాటం జరిగిన తెలంగాణ గడ్డ… గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలిచింది. భాషలు, మతాలు వేరైనా, మనమంతా భాయి… భాయి అంటూ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు గురజాడ చెప్పినట్టు అన్నదమ్ముల వలె కలగలిసి తిరుగుతున్నారు.
అయితే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ… ఈ సోదరతత్వాన్ని విడదీసి, పరమత సహనానికి బీటలు వార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలను గెలిచిన కమలం పార్టీ… ఇక్కడ ఏ మూలన ఏం జరిగినా, దాన్ని తనకు అనుకూలంగా మలుచు కునేందుకు ప్రయత్నిస్తోంది. భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు అది కుయుక్తులు పన్నుతోంది. వ్యక్తిగత విభేదాలకు మతం రంగు పూస్తూ.. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు అది కుట్రలు పన్నుతోంది. వాటికి సామాన్య ప్రజలు బలవుతుండటం ఆందోళనకరం. దాని ఉచ్చులో కొందరు పావులుగా మారుతున్నారు. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో జరిగిన ఘటన ఈ కోవలోకే వస్తుంది. గతంలో అదే జిల్లాలోని భైంసాలో ఆ పార్టీ మత ఉద్రికత్తలను రెచ్చగొట్టిన తీరు మనకు గుర్తే. ఇప్పుడు మరో కొత్త ప్రాంతమైన జైనూరులో కూడా అదే తరహాలో చిచ్చుపెట్టేందుకు, తద్వారా రాజకీయలబ్ది పొందేందుకు కాషాయ పార్టీ చూస్తోంది. ఆయా ఘటనలను విచారించి, నిజా నిజాలను నిగ్గు తేల్చాల్సింది, బాధితులకు న్యాయం చేయాల్సింది, బాధ్యులను శిక్షించాల్సింది పోలీసులు, కోర్టులు. కానీ ధరలు, నిరుద్యోగం, పేదరికం, ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు, సీజనల్ వ్యాధుల్లాంటి ప్రజల దైనందిన సమస్యల గురించి ఒక్కరోజు కూడా పట్టించుకోని బీజేపీ… జైనూరు లాంటి ఘటనల్లో మాత్రం జోక్యం చేసుకోవటం అత్యంత విడ్డూరం. ఆయా విషయాల్లో ఒక రాజకీయ పార్టీగా అన్నింటికి మతం రంగు పులమటం, తద్వారా చిలువలు పలువలు చేయటం దానికే చెల్లింది.
ఇక్కడ మనం ఒక విషయాన్ని సీరియస్‌గా గమనించాలి. గత కొన్నేండ్లుగా రాష్ట్రంతోపాటు దేశంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టు కోసం బీజేపీ అనేక రకాల ప్రయోగాలు చేస్తోంది. వనవాసీ కళ్యాణ పరిషత్ తదితర సంస్థల పేర్లతో వారిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది, అలా ప్రయత్నించి కొన్నిచోట్ల సఫలీకతమైంది, ఫలితాలు సాధించింది. జైనూరుతో పాటు ఆ జిల్లాలోని అనేక గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో సరైన ఉపాధి అవకాశాల్లేకపోవటం సమస్యలకు ప్రధాన కారణం. దీంతో ఆదివాసీలు, ఇతర గిరిజనుల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితిని బీజేపీ తనకు అనుకూలంగా మలచుకుంది. ఆదివాసీలను రెండు వర్గాలుగా విడదీసి, వారిలో వారికి చిచ్చుపెట్టి, వారితో మైదాన ప్రాంత గిరిజనులకు గొడవలు సృష్టించి, నానా యాగీ చేస్తోంది.
మరోవైపు జానీ మాస్టర్ వ్యవహారంపై కూడా రచ్చ చేసేందుకు బీజేపీ కాసుక్కూర్చుంది. ఈ అంశంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గమనార్హం. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేటి కేంద్ర మంత్రి బండి సంజరు…’మసీదులన్నీ కూలుస్తాం…’ అంటూ ప్రమాదకరమైన కామెంట్లు చేయటం ఆ పార్టీ విద్వేష బీజాలకు పరాకాష్ట. ‘శవాలు, శివలింగాలు…’ అంటూ ఆయన వ్యాఖ్యానించటాన్నిబట్టి తన పార్టీ ‘ఉద్దేశమేంటో’ చెప్పకనే చెప్పారు.
బహుశా ఇలాంటి ప్రమాదాలను రాష్ట్ర మంత్రి సీతక్క ముందే పసిగట్టారు కాబోలు. మతతత్వ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. దుష్టశక్తులు పేట్రేగేందుకు అవకాశమివ్వొ ద్దంటూ జనాలను అప్రమత్తం చేశారు. అంతేకాదు నిజాం హయం నుంచి ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో సఖ్యతగా మెలిగిన ఆదివాసీ, మైనారిటీ వర్గాల మధ్య విభేదాలు తలెత్తడం పట్ల విచారం వ్యక్తం చేస్తూనే ఇలాంటి సమస్యలను పైపైన చూడకూడదనీ, వాటి మూలాల్లోకి వెళ్లాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మైనారిటీల పట్ల యువతలో వ్యతిరేక భావనను పెంపొం దిస్తున్న దుష్ట శక్తులపట్ల కఠినంగా వ్యవహరించాలంటూ ఆమె ఆదేశించారు. ఇదే సమయంలో జైనూరు ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు త్వరలోనే ప్రభుత్వం తరపున ఒక ఉమ్మడి సమావేశాన్ని నిర్వహిస్తామంటూ ఆమె భరోసా నివ్వటం హర్షణీయం. అదే సమయంలో ‘మైనారిటీ శక్తులు’ కూడా హద్దు దాటితే ‘చట్టం తన పని తాను చేసుకు పోతుంది…’ అని చెప్పటం ద్వారా మతతత్వ శక్తులకు ఎలాంటి అవకాశం, ఆస్కారం ఇవ్వకుండా చూడటం కూడా సరైందే. ఈ విషయంలో ఆదిలాబాద్ ఇంచార్జి మంత్రిగా సీతక్క చొరవను, కృషిని అభినందించి తీరాలి. అయితే ఆమె ప్రయత్నమొక్కటే ఇక్కడ సరిపోదు. ఇలాంటి సున్నిత అంశాలను పరిశీలించి, పరిష్కరించాల్సిన బాధ్యత నేటి రేవంత్ సర్కార్‌పై ఉంది. ప్రజల మధ్య చిచ్చుపెట్టే అరాచక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్న సంకేతాన్ని అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంపాలి. అప్పుడే ఏచూరి చెప్పిన మన పూల బొకే మరింత అందంగా కనబడుతుంది.