హరీశ్‌రావు వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ దృష్టి పెట్టాలి

– బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకపోతే హైదరాబాద్‌ సంకనాకి పోతుందని హరీశ్‌రావు వ్యాఖ్యానించడంపై బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందనే చర్చ ప్రారంభమైన ప్రతిసారీ బూతులు మాట్లాడడం, ప్రజల్ని సెంటిమెంట్‌తో లోబర్చుకోవడం బీఆర్‌ఎస్‌ నాయకులకు అలవాటేనని విమర్శించారు. హరీశ్‌రావు, ఆయన మామ పుట్టుక ముందు నుంచే హైదరాబాద్‌ నగరం ఉందని చురకలంటించారు. అనేక సాంస్కృతిక, సాంప్రదాయాలకు హైదరాబాద్‌ కేంద్రమనీ, దీనిపై చర్చకు బీఆర్‌ఎస్‌ నేతలు రావాలని సవాల్‌ విసిరారు. టాలీవుడ్‌ సినీమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ హైదరాబాద్‌ అన్నారు. వ్యాక్సిన్లు, జనరిక్‌ మెడిసిన్‌ ఉత్పత్తిలో దేశంలోనే మన నగరం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. విశ్వవిద్యాలయాల కేంద్రంగా ఉందన్నారు.
హైదరాబాద్‌ ప్రపంచవ్యాప్త నగరంగా గుర్తింపు పొందిందని చెప్పారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో కాకతీయుల కాలంలో కట్టిన చెరువులు, కుంటలు మాయమవుతున్నాయని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే భూ మాఫియా భరతం పడతామని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ప్రకాష్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.