స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నిక లాంఛనమే…

Election of Gaddam Prasad Kumar as Speaker is a formality...–  బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, సీపీఐ మద్దతు
–  రేపు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం
– 16న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. స్పీకర్‌ ఎన్నికకు ప్రసాద్‌ కుమార్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రసాద్‌ కుమార్‌ అభ్యర్ధిత్వానికి ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్‌, ఎంఐఎం, సీపీఐ పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. రాజకీయాలకతీతంగా ఉండే స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియకు కూడా బీజేపీ దూరంగా ఉంది.
స్పీకర్‌ ఎన్నికకు సంబంధించి శాసనసభ కార్యదర్శి వి.నరసింహా చార్యులు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా, అధికార పక్షం నుంచి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ బుధవారం నామినేషన్‌ వేశారు. ఆయన నామినేషన్‌ పత్రంపై సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ సంతకాలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఇతర ఎమ్మెల్యేల సమక్షంలో అసెంబ్లీ కార్యదర్శికి ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్‌ పత్రాలు అందజేశారు. గురువారం శాసనసభ ప్రారంభంకాగానే స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ప్రకటించనున్నారు. సభా నాయకుడు, సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు ప్రసాద్‌ కుమార్‌ తోడ్కొని స్పీకర్‌ స్థానం వద్దకు తీసుకెళతారు. అనంతరం స్పీకర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఉభయ సభలనుద్దేశించి శుక్రవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగిస్తారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో శనివారం చర్చ జరగనుంది.
తెలంగాణ తొలి దళిత స్పీకర్‌గా గడ్డం
కొత్తగా కొలువుదీరిన సభకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున స్పీకర్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్పీకర్‌గా ఉంటారు. గడ్డం ప్రసాద్‌ స్పీకర్‌గా నియమితులైతే తెలంగాణ రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్‌ ఆయనే కానున్నారు.
కాంగ్రెస్‌ పార్టీకి గడ్డం ప్రసాద్‌కుమార్‌ అత్యంత విదేయుడు. సీనియర్‌ నాయకుడు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి గ్రామంలో 1964లో ఆయన జన్మించారు. తాండూరు ప్రభుత్వ కళాశాలలో ఆయన ఇంటర్మీడియట్‌ వరకూ చదువుకున్నారు. ఆయనకు భార్య శైలజ, ఇద్దరు పిల్లలున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో (2008) ఆయన వికారాబాద్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో గెలిచారు. 2012లో ఆనాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా సేవలందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిగిరి గెలుపొందారు.
నేటి నుంచి అసెంబ్లీ  నాలుగు రోజులపాటు నిర్వహణ
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు స్పీకర్‌ ఎన్నిక అనంతరం సభ వాయిదా పడనుంది. శుక్రవారం సభ్యులనుద్దేశించి గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రసంగిస్తారు. అనంతరం శనివారం గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. సభ ఆదివారం కూడా కొనసాగనుందని అధికారిక వర్గాలు తెలిపాయి.