– జమ్ముకాశ్మీర్ పాలనా యంత్రాంగానికి సీపీఐ(ఎం) డిమాండ్
శ్రీనగర్: రాజస్థాన్ ఉర్జా వికాస్ అండ్ ఐటీ సర్వీసెస్ లిమిటెడ్‌తో రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, జమ్మూ కాశ్మీర్ విద్యుత్ అభివృద్ధి కార్పొరేషన్లు ఇటీవల కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సీపీఐ(ఎం) నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి తీవ్రంగా వ్యతిరేకించారు. 40ఏండ్లపాటు విద్యుత్‌ను తీసుకోవడానికి కుదిరిన ఈ ఒప్పందం ఎంతమాత్రమూ సమర్ధనీయం కాదని పేర్కొన్నారు. పైగా జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఈ ఒప్పందం వ్యతిరేకంగా వుందన్నారు. తీవ్ర విద్యుత్ కొరతతో జమ్ముకాశ్మీర్ ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ ఒప్పందం కుదిరింది. టారిఫ్‌లు భరించలేని విధంగా పెరగడంతో ప్రజల ఇబ్బందులు మరింత పెరిగాయని తరిగామి పేర్కొన్నారు. నష్టాలను తగ్గించడానికి బదులుగా, మన వనరులను ఇతర రాష్ట్రాలకు అప్పగించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. జమ్ముకాశ్మీర్ పాలనా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం అన్యాయమైనదని అన్నారు. ప్రజలను మరింత కష్టాల పాల్జేసేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. తక్షణమే ఈ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి రాసిన లేఖను విద్యుత్ శాఖ మంత్రిత్వశాఖకు అందజేశారు.