అంతుచిక్కని అధిష్టానం నిర్ణయం

అంతుచిక్కని అధిష్టానం నిర్ణయం– కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు నామినేషన్‌ : హైకమాండ్‌ సూచన మేరకేనన్న మంత్రి పొన్నం
– అలిగిరెడ్డిని బుజ్జగించేందుకు అధిష్టానం పిలుపు?
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి విషయంలో ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం అంతుచిక్కకుండా ఉంది. రాష్ట్రంలో ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాలకు ఇంకా అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. అందులోనూ ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్‌లో మాత్రం ఆ పార్టీ నుంచి వెలిచాల రాజేందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఉన్నారు. సోమవారం వెలిచాల రాజేందర్‌ భారీ జనసందోహంతో ర్యాలీగా వచ్చి నామినేషన్‌ వేశారు. అయితే, అధికారికంగా వెలిచాలను ప్రకటించకపోయినప్పటికీ హైకమాండ్‌ సూచన మేరకు ఆయనతో నామినేషన్‌ వేయించామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ మీడియాతో స్పష్టం చేశారు. దీనిపై అలిగిరెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్‌ ప్రక్రియ ముగింపు దశకు వస్తున్నా.. అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకుండా కరీంనగర్‌ కాంగ్రెస్‌ శ్రేణుల ఉత్కంఠకు తెరదించకుండా ఆ పార్టీ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయంపైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్టీ సింహభాగం వెలిచాల వెంట నడుస్తుండగా.. తాను పోటీలో ఉన్నట్టుగా అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి చడీచప్పుడు లేకుండా ఉండిపోయారు. ఇదే సమయంలో టిక్కెట్‌ కోసం ఆయన పీసీసీ స్థాయిలో ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారన్న వార్తలూ వస్తున్నా..
ఈ ఎన్నికల్లో వెలిచాలను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎన్నికల ప్రచారంలో తిరుగుతుండటం వెనుక వెలిచాల అభ్యర్థిత్వం ఖరారే అన్న సంకేతాలకు బలం చేకూర్చుతోంది. అయితే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం ఢిల్లీకి పిలిపించినట్టు తెలిసింది. అధిష్టానం పెద్దలు ఆయనతో మాట్లాడి సర్ధిచెప్పే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి.