– భిన్న జాతులు, మతాలు, కులాలను
– ఐక్యం చేసిన ఘనత రాజ్యాంగానిదే
– దాని స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే ప్రజాపోరాటాలు తప్పవు
– గత పదేండ్లలో రాజ్యాంగ విలువలు ధ్వంసమయ్యాయి
– సామాజిక న్యాయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వం
– గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”పదేండ్ల నియంతృత్వానికి తెలంగాణ ప్రజలు చరమ గీతం పాడారు. భిన్న జాతులు, మతాలు, కులాలను ఐక్యం చేసిన ఘనత భారత రాజ్యాంగానిది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ మన్ననలు అందుకుంటూ 74 ఏండ్లుగా ఆ రాజ్యాంగ మార్గదర్శకత్వంలో ముందుకు సాగడమనేది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఈ ఘనత రాజ్యాంగ నిర్మాతలకు, ఈ దేశ ప్రజలకు దక్కుతుంది. దానికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే ప్రజాపోరాటాలు తప్పవు. గత పదేండ్లలో రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు ధ్వంసం అయ్యాయి. నియంతృత్వానికి సమాధికట్టి కొత్తగా ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది” అని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలకు, ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులకు, ప్రభుత్వ యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పని చేస్తోందని గవర్నర్ ఈ సందర్భంగా చెప్పారు., ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని తెలిపారు. గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. మిగిలిన గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాం. లబ్దిదారులను ఎంపిక చేసేందుకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. మొత్తం 1,25,84,383 దరఖాస్తులు ప్రభుత్వానికి అందగా, అందులోో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు వచ్చాయి. ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు అందాయి. వీటిని శాఖల వారిగా క్రోడీకరించి, వాటి పరిష్కారానికి కార్యచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోంది. గత పాలకుల నిర్వాకంతో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారినా, గాడి తప్పిన వ్యవస్థలన్నింటినీ, సంస్కరించే ప్రయత్నం చేస్తున్నాం. అభివద్ధిలో తెలంగాణ ప్రపంచంతో పోటీ పడేలా, సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతోంది.గడచిన పదేళ్ల పాలకుల వైఫల్య ఫలితంగా యువతకు ఉపాధి, ఉద్యోగాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం జరిగింది. తెలంగాణ ఉద్యమ సారధులైన యువత విషయంలో గత ప్రభుత్వం పూర్తి నిర్దయగా, నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టీఎస్పీఎస్సీ కొత్తగా పాలక మండలిని ఎంపిక చేశాం. తద్వార ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. ఈ విషయంలో యువత ఎలాంటి అనుమానాలు, అపోహలకు లోను కావాల్సిన అవసరం లేదని తమిళిసై ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
రైతులకిచ్చిన హమీలను అమలు పరుస్తాం
రైతుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. వరంగల్ డిక్లరేషన్ అమలుకు కార్యచరణతో పాటు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే చిన్న సన్నకారు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేశాం. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. రైతులకు ఇచ్చిన మాట నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నామని ఆమె తెలిపారు.
రికార్డు స్థాయిలో పెట్టుబడులు
రాష్ట్రానికి ఈ సారీ పెట్టుబడుల వరద కొనసాగింది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఎన్నడూ లేని విధంగా రూ.40,232 కోట్ల మేర ఒప్పందాలు కుదుర్చుకోవడం తెలంగాణ పురోగమనానికి సంకేతం. ఈ ప్రయత్నం రాష్ట్రంలో పారిశ్రామిక వద్ధికి… తద్వారా ఉపాధి అవకాశాల కల్పనకు ఉపకరిస్తుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.
ప్రజాస్వామ్య పునరుద్దణ జరిగింది
తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్దరణ జరిగింది. గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు. కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. పేదల కన్నీళ్లు తుడిచే నాధుడు లేని పాలన గతంలో చూశాం. మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రజావాణి పేరుతో సమస్యలు వినేందుకు మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. సచివాలయంలో సామాన్యులు సైతం వచ్చి ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ వచ్చింది.ప్రజావాణి కార్యక్రమాన్ని కేవలం హైదరాబాదుకే పరిమితం చేయకుండా క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అంబేద్కర్ స్పూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా పాలన దిశగా ఈ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇదే స్పూర్తితో ఇక ముందు కూడా పాలన సాగాలని గవర్నర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. రాజ్యాంగం కేవలం న్యాయవాదుల పత్రం కాదు, అది జీవితానికి వాహనం లాంటిది. దాని స్ఫూర్తి అందరికి ఆదర్శమనే అంబేద్కర్ చెప్పిన మాటలతో ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి,గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు.