
– గ్రామస్తులతో మాట్లాడిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – బెజ్జంకి
తమ గ్రామ శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ వల్ల భవిష్యత్తులో ఎవరి లాభాలు ఉంటాయో?ఎవరికి నష్టాలు ఉంటాయో? తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని..భవిష్యత్తు తరాల దృష్ట్యా పరిశ్రమ అనుమతులను రద్దు చేయాల్సిందేనని.. పరిశ్రమ వల్ల వాటిల్లే నష్టాలపై పూర్తి స్థాయిలో సందేహాలను నివృత్తి చేశాకే నిర్మాణ పనులు చేపట్టాలని మండల పరిధిలోని నర్సింహుల పల్లి గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గ్రామస్తుల సందేహాలను ప్రభుత్వాధికారులు,పరిశ్రమ యాజమాన్యాలు నివృత్తి చేయాల్సిన ఆవశ్యకత ఉండడంతో శుక్రవారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పరిశ్రమ యాజమాన్యంతో కలిసి నర్సింహుల పల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు.ఇథనాల్ పరిశ్రమను రద్దంటే రద్దు చేయాల్సిందేనని పలువురు గ్రామస్తులు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి మొరపెట్టుకున్నారు.ఇతర ప్రాంతాల్లో నిర్మించిన పరిశ్రమలను సందర్శించి సందేహలను నివృత్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తామని,గ్రామస్తుల డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకువేళ్తామని అదనపు కలెక్టర్ హామీనిచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు.ఎంపీటీసీ కొలిపాక రాజు,తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి,ఆర్ఐ సుహాసిని, సూపరిండెంట్ అంజయ్య,అయా శాఖల అధికారులు, పలువురు గ్రామస్తులు హజరయ్యారు.