– జార్జియా ప్రధాని
గత వారం హత్యాయత్నం నుంచి బయట పడిన స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోకు పట్టిన గతే తనకు కూడా పడుతుందని యూరోపియన్ కమిషనర్ తనతో చెప్పాడని జార్జియా ప్రధాన మంత్రి ఇరాక్లీ కోబాఖిడ్జే అన్నాడు. జార్జియాలోని విదేశీ ఎన్‌జీఓలు తమ నిధులను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్న చట్టాన్ని తన ప్రభుత్వం ముందుకు తెస్తే పశ్చిమ దేశాలు తనపై ”అనేక చర్యలు” తీసుకుంటాయని పేరులేని కమిషనర్ ఇటీవల ఫోన్ కాల్‌లో హెచ్చరించాడని గురువారంనాడు ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో కోబాఖిడ్జే చెప్పాడు.
మే 15న హండ్లోవా పట్టణంలో ప్రభుత్వ సమావేశానికి వెలుపల మద్దతుదారులతో కలిసినప్పుడు ఫికోపై అనేకసార్లు కాల్పులు జరిగాయి. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అత్యవసర శస్త్రచికిత్స చేసిన తరువాత ప్రస్తుతం అతను గాయాల నుంచి కోలుకుంటున్నాడు. ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని ఫికో నిలిపివేయడానికి నిరసనగా హత్యాయత్నానికి పాల్పడినట్లు కాల్పులు జరిపిన 71 ఏళ్ల కవిపై అభియోగాలు వచ్చాయి.
జార్జియా పార్లమెంట్ గత వారం ‘ట్రాన్స్‌పరెన్సీ ఆఫ్ ఫారిన్ ఇన్‌ఫ్లూయెన్స్ యాక్ట్’ను ఆమోదించింది. చట్టం ప్రకారం ఎన్జీవోలు, మీడియా సంస్థలు, వ్యక్తులు విదేశాల నుంచి తమ నిధులలో 20 శాతం కంటే ఎక్కువ పొందుతున్న వారు ”విదేశీశక్తి ప్రయోజనాలను ప్రోత్సహించే” సంస్థలుగా నమోదు చేసుకోవాలి. వారి దాతలను బహిర్గతం చేయాలి. ఈ చట్టాన్ని జార్జియా పాశ్చాత్య అనుకూల అధ్యక్షురాలు సలోమ్ జౌరాబిచ్విలి వీటో చేయగా, పార్లమెంటు వీటోను తొలిగిస్తుందని భావిస్తున్నారు. అమెరికా, బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాలలో ఇలాంటి, ఇంతకంటే మరింత కఠినమైన విదేశీ ప్రభావ చట్టాలు ఉన్నప్పటికీ, జార్జియా విదేశీ ఏజెంట్ చట్టాన్ని అమెరికా, యూరోపియన్ యూనియన్ అధికారులు తీవ్రంగా ఖండించారు.
”మేము ఈ రకమైన అవమానకరమైన బ్లాక్‌మెయిల్‌కు చాలా కాలంగా అలవాటు పడ్డాము” అని కోబాఖిడ్జ్ రాశాడు. ”రాబర్ట్ ఫికోపై జరిగిన హత్యాయత్నానికి సమాంతరంగా గ్లోబల్ వార్ పార్టీ రూపంలో మేము జార్జియాలో గందరగోళాన్ని తీసుకురావడానికి ఏదైనా చేయగల అత్యంత ప్రమాదకరమైన శక్తితో వ్యవహరిస్తున్నామని మాకు తెలుసు” అని జార్జియా ప్రధాని అన్నాడు. పారదర్శకత చట్టం లేకుండా, దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ నిధులను అందుకుంటున్న ఎన్‌జీఓలు 2014లో ఉక్రెయిన్‌లో అమెరికా మద్దతుతో జరిగిన ‘మైదాన్’ తిరుగుబాటు వంటి తిరుగుబాటును సులభంగా ప్రేరేపించగలవని బుధవారంనాడు జార్జియాకు చెందిన ఛానల్ 1కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోబాఖిడ్జే అన్నాడు. ”మాకు పారదర్శకత కావాలి. మేము ఈ దేశంలో బురద నీటిని వదిలివేయకూడదనుకుంటున్నాము. ఎందుకంటే ‘జార్జియన్ మైదాన్’ మన దేశాన్ని చాలా తీవ్రమైన పరిణామాలకు, దాని ‘ఉక్రైనైజేషన్’కి దారి తీస్తుంది. మేము దీనితో ఏకీభవించలేము” అని అతను చెప్పాడు.