వీడని ఉత్కంఠ..!

– మూడు స్థానాల్లో తేలని అభ్యర్థితత్వం
– కసరత్తుతో కాలమెళ్లదీస్తున్న అధిష్టానం
– మిగిలింది మూడు రోజులే
– తీవ్ర నిరాశలో ఆశావహులు
– గందరగోళంలో పార్టీ శ్రేణులు
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థుల్లో పార్టీ శ్రేణుల్లో ప్రధానంగా ఆశావాహుల్లో టెన్షన్‌ నెలకొంది. అభ్యర్థులను ఖరారు చేయడంలో కాంగ్రెస్‌ అధిష్టానం కాలయాపన చేస్తుండడంతో ఆశావాహుల పాటు పార్టీ శ్రేణులు నిరాశ నెలకొంది. రెండు నెలల కిందటే అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓమారు ప్రచారం ముగించారు. కానీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఇప్పటివరకు 9 స్థానాలు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన సూర్యాపేట తుంగతురి,్త మిర్యాలగూడ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది. నామినేషన్‌ గడువుకు ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. పదో తేదీ చివరి గడువు కావడంతో గురువారం నాటికి అభ్యర్థులను ఖరారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నవతెలంగాణ -మిర్యాలగూడ
2018 జరిగిన ఎన్నికలు కూడా కాంగ్రెస్‌ నామినేషన్‌కు చివరి రోజున అభ్యర్థిని ప్రకటించడంతో నియోజవర్గ వ్యాప్తంగా ప్రచార చేయడంలో వెనుకబడిపోయారు. దీంతో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌ ఓడిపోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా అభ్యర్థులను ప్రకటించడంలో కాలయాపన జరుగుతుండడంతో ఆశావహుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఇప్పటికైనా ప్రకటించకపోతే ప్రచారం చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయని అధిష్టానం ముందు వాపోతున్నారు. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ దక్కని వారిని తమ పార్టీలో చేర్చుకొని టికెట్‌ ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే మిర్యాలగూడ స్థానానికి టికెట్‌ ఖరారు చేయలేదని ప్రచారం నడుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట తుంగతుర్తి మిర్యాలగూడ నియోజవర్గ స్థానానికి పోటీ చేసే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఇప్పటివరకు అధిష్టానం ప్రకటించలేదు సూర్యాపేటలో మాజీ మంత్రి రామ్‌ రెడ్డి దామోదర్‌ రెడ్డి, పీసీసీ కార్యదర్శి పటేల్‌ రమేష్‌ రెడ్డి తీవ్ర పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో వీరిద్దరికి ప్రజాబలం ఉండడంతో పాటు ఆయా సర్వేలలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై అధిష్టానం తర్జనభజన పడుతుంది. తుంగతుర్తిలో తెలంగాణ ఉద్యమకారుడు అద్దంకి దయాకర్‌తో పాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు, పిడమర్తి రవి, శ్యాంసుందర్‌ లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. వీరిలో అద్దంకి దయాకర్‌ మోత్కుపల్లి నర్సింహులకు మధ్యనే తీవ్ర పోటీ నిలుకొంది.
పొత్తుల పేరుతో జాప్యం
రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరుగా మిర్యాలగూడ నియోజవర్గ స్థానం నిలిచింది. అలాంటి నియోజకవర్గానికి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానానికి ఎప్పుడు తలనొప్పి గానే ఉంటుంది. ఇక్కడి నుంచి పోటీ చేసే ఆశావాహులు ఎక్కువగా ఉండడం వల్ల అభ్యర్థి ఎంపిక చేయడం పట్ల తీవ్ర జాప్యం జరుగుతుంది 2018 ఎన్నికల్లో సైతం నామినేషన్‌ చివరి రోజున ఆర్‌.కష్ణయ్యను అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్నికల్లో సిపిఎం నుంచి పొత్తు కుదుర్చుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ మిర్యాలగూడ స్థానాన్ని ముందుగానే సిపిఎం కు కేటాయించింది.సీపీఐ(ఎం)కు కేటాయించిన రెండో స్థానం ఖమ్మం జిల్లాలో వైరా ఉండగా దానిని కేటాయించిన విషయంలో కాంగ్రెస్‌ మాట మార్చడంతో పొత్తు మొదటికి వచ్చింది. ఇరు పార్టీల నాయకులు చర్చలు జరిపినప్పటికీ సమస్య కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్‌ జాప్యాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం) ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించి అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ ప్రకటించిన మొదటి విడత జాబితాలో మిర్యాలగూడ తరపున జూలకంటి రంగారెడ్డి పేరు ప్రకటించడంతో కాంగ్రెస్‌ ఆశావాహులకు లైన్‌ క్లియర్‌ అయింది. కాంగ్రెస్‌ తరపున ఈ స్థానానికి 18 మంది పోటీ పడుతుండగా ప్రధానంగా సామాజికవేత్త భత్తుల లక్ష్మారెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీరారెడ్డి డిసిసి అధ్యక్షులు శంకర్‌ నాయక్‌ మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు మాధవి, బీసీ కోటలో చిరుమర్రి కష్ణయ్య రామలింగ యాదవ్‌ ప్రధానంగా పోటీపడుతున్నారు. కాంగ్రెస్‌ చేపట్టిన అనేక సర్వేల్లో లక్ష్మారెడ్డి పేరు వినిపించడంతో పాటు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తంకుమార్‌ రెడ్డి మద్దతు తెలపడంతో ఇతని పేరు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతుంది. నేడు, రేపు పేరు ప్రకటించనున్నట్టు అతని అనుచరులు పేర్కొంటున్నారు. కాగా అతని టికెట్‌ ఇస్తే తాము సహకరించమని పాత కాంగ్రెస్‌ క్యాడర్‌ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.