– లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ వ్యూహమిదే…
– అదే శ్రీరామ రక్ష అని భావిస్తున్న అధిష్టానం
– గతంలో తమది జాతీయ పార్టీ అని ప్రకటించిన కేసీఆర్
– అందుకు భిన్నంగా తిరిగి ప్రాంతీయ వాదన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి మంత్రాన్ని జపించిన బీఆర్‌ఎస్… ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ అస్తిత్వాన్ని మళ్లీ తెరపైకి తెస్తోంది. ‘తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ’ అనే నినాదాన్ని మరోసారి ఎత్తుకోవటం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో కొంతలో కొంత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఆ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందుకోసం నేతలు తీవ్రంగా మేధోమథనం చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వ నినాదమే తమకు శ్రీరామరక్ష అని బీఆర్‌ఎస్ అధిష్టానం సైతం భావిస్తోంది. అందుకనుగుణంగానే కార్యాచరణ రూపొందించనుంది. బుధవారం నుంచి ప్రారంభమైన పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సన్నాహక సమావేశాల్లో ఈ మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఆ సమావేశానంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సైతం ఆయన ‘అస్తిత్వ’ నినాదాన్నే పలుమార్లు చెప్పుకొచ్చారు. ‘తెలంగాణ గళం-తెలంగాణ బలం-తెలంగాణ దళం బీఆర్‌ఎస్’ అంటూ కేటీఆర్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. వాస్తవానికి తెలంగాణ అస్తిత్వ నినాదం ఆధారంగానే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్-ఇప్పుడు బీఆర్‌ఎస్) ఆవిర్భవించింది. అయితే ఏడాది క్రితం దాని పేరును అధినేత కేసీఆర్… భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చారు. తమది జాతీయ పార్టీ అంటూ ఆయన ఆ సందర్భంలో ప్రకటించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్‌ఎస్‌ను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. అందుకనుగుణంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో విభాగాలను కూడా ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తామంటూ కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో పర్యటించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నేతలను కలిసొచ్చారు. దేశవ్యాప్తంగా రైతులందరూ బాగుపడాలని కోరుతూ ‘అన్నదాతల సమస్యలే తమ ప్రధాన అజెండా…’ అని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో పలుమార్లు పర్యటించిన ఆయన అక్కడ రెండు మూడు బహిరంగ సభలను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతకుముందు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఫెడరల్ ఫ్రంట్’ అనే అంశాన్ని కేసీఆర్ తెరమీదికి తెచ్చిన సంగతీ విదితమే. అయితే అది ఎంత స్పీడుగా తెరమీదికి వచ్చిందో, అంతే స్పీడుగా తెరమరుగు కావటం గమనార్హం. ఈ రకంగా ఫెడరల్ ఫ్రంట్, బీఆర్‌ఎస్ అనే పేర్లతో జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామంటూ చెబుతూ వచ్చిన గులాబీ పార్టీ.. ఇప్పుడు మళ్లీ అస్తిత్వ వాదాన్ని ముందుకు తేవటంపై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు చెప్పుకోవటానికి ఏమీ ఉండదు కాబట్టే… ఆ వాదాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారనే వాదనలు వినబడుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో బీజేపీపై విమర్శలకు వెనుకాడని కారు పార్టీ…మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, ఆర్టికల్ 370 రద్దు తదితరాంశాల్లో మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో విధానపరంగా ఆ పార్టీ అనేక సమయాల్లో తీసుకున్న వైఖరులపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కూడా మరోసారి అస్తిత్వ వాదాన్ని పైకి తీసుకురావటంపై పలువురు అదేరకంగా విమర్శలు గుప్పిస్తున్నారు.