భారతీయ సినిమా రంగులు కడిగి
మూసధోరణికి మంగళం పలికి
నిప్పులాంటి నిజాల్ని వెలికితీసి
వాస్తవికత అసలు రూపాన్ని
కళాత్మక వైభవంతో ప్రదర్శించి
అవార్డుల వర్షంలో తడిసి ముద్దయిన ఘనుడు
బెనగళ్ల శ్యామ సుందరుడు..
సమకాలీన సమాజాన్ని
అవపోసన పట్టి
కలల లోకాన్ని ఇలకు దించి
సామాజిక స్పృహను తెరకెక్కించి
మనసు పొరల్లో సహజత్వం గుచ్చి
సూర్యోదయాన్ని వెలుగులోకి తెచ్చిన
వాస్తవాల తపస్వి అతడు…
వేయితలల కులసర్పం బుసలు
పేదరికం మానవీయ విలువలు
వీధి బాలల బాలకార్మికుల వెతలు
ఎన్నెన్నో యధార్ధ వ్యథార్ధ గాథలు
ప్రేక్షకుల హృదయాలు తట్టిలేపేలా
అనితరసాధ్య రీతిలో చిత్రిక పట్టి
హద్దులు చెరిపి
వాస్తవికతకు అద్దం పట్టి
అద్భుత కళాఖండాన్ని
ప్రదర్శించిన నిజమైన కళాకారుడు!
(శ్యామ్ బెనగళ్ స్మృతి పథంలో..)
– భీమవరపు పురుషోత్తమ్ 9949800253