
– గిరిజన ప్రాంతం పట్ల అధికారుల వివక్షే – సీపీఐ(ఎం) నాయకులు కనకయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
గత మూడు రోజులుగా ఎడతెరిపిలేని వానలతో సామర్ధ్యం మించి వరద తో గురువారం ధ్వంసం అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,నియోజక వర్గ కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్ట్ ను తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్య లు స్థానిక పార్టీ,సంఘం నాయకులతో కలిసి శుక్రవారం సందర్శించారు. అనంతరం సుదర్శన్ రావు విలేఖర్లతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ను ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావడంతో ఒక కాలువ తెలంగాణ,రెండో కాలువ ఆంధ్రా భూ భాగాల్లో ఉండటంతో ఈ రెండు రాష్ట్రాల పాలకుల నిర్లక్ష్యం కు గురి కావడంతో నిధులు సక్రమంగా కేటాయించకపోవడంతో నిర్వహణ లేమితో గేట్లు మరమ్మత్తులకు గురై ప్రాజెక్ట్ కే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,రాష్ట్ర స్థాయి అధికారులు ఉమ్మడి సమావేశం ఏర్పాటు ఈ ప్రాజెక్టు పునరుద్ధరించాలని ఇరు ప్రభుత్వాలను డిమాండ్ చేసారు. అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కాలువలు ఆంధ్ర తెలంగాణ భూ భాగాల్లో ఉండటంతో పాటు పూర్తీ ఆదివాసి ప్రాంతంలో నెలకొని ఉండటంతో అధికారులు వివక్ష చూపారు అని అన్నారు.ఇప్పటికైనా మరమ్మత్తులు నిర్వహించి పంటలకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. పుల్లయ్య మాట్లాడుతూ ప్రాజెక్ట్ పూర్తిగా నిర్వహణ వైఫల్యానికి గురైందని,వార్షిక మరమ్మత్తులు సైతం గత అధికారులు సరిగ్గా నిర్వహించుకోవడం తోనే గేట్లు సైతం మొరాయించాయి అని అందువలనే వరద కట్టను తెంచుకుని దిగువ ప్రాంతానికి వరద వెళ్ళి నష్టం వాటిల్లిందని అన్నారు.ఈ వరదలతో పరీవాహక పొలాల్లో ఇసుక పేరుకు పొయింది అని, దాన్ని తొలిగించి రైతులకు నష్టపరిహారం ఇచ్చి,సాగు నీరు ఇచ్చేలా పనులు చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం జిల్లా అద్యక్షులు అన్నవరపు సత్యనారాయణ,అశ్వారావుపేట,ములకలపల్లి మండలాల సీపీఐ(ఎం) కార్యదర్శులు బుడితి చిరంజీవి,ముదిగొండ రాంబాబు,రైతు నాయకులు ఆళ్ళ నాగేశ్వరరావు లు ఉన్నారు.