పశ్చిమ దేశాల పతనం అనివార్యం!

పశ్చిమ దేశాల పతనం అనివార్యం!– లాటిన్‌ అమెరికా నాయకుడు
అమెరికా ఆర్థిక వ్యవస్థ అపరిమితంగా డాలర్లను ప్రింట్‌ చేయటమనే బూటకపు పునాది మీద ఆధారపడి ఉందని, ఈ బుడగ అనివార్యంగా పేలినప్పుడు పశ్చిమ దేశాల నాగరికత పతనం అవుతుందని ఎల్‌ సాల్వెడార్‌ అధ్యక్షుడు నయిబ్‌ బర్కిలీ అన్నాడు. 84% ఓట్లతో రెండవ సారి ఎల్‌సాల్వెడార్‌ అధ్యక్షుడిగా గెలిచాక కన్సర్వేటివ్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ(సిపిఏసి) సమావేశంలో పాల్గొనటానికి శనివారం మేరీల్యాండ్‌ కి వచ్చినప్పుడు చేసిన ఉపన్యాసంలో ఆయన ఇలా మాట్లాడాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో సమూల మార్పులు తేవాలని ఆయన తన ఉపన్యాసాన్ని ముగిస్తూ విజ్ఞప్తి చేశాడు. బర్క్‌ లీ బిట్‌ కాయిన్‌ ను చట్టబద్దం చేయటాన్ని, క్రిమినల్‌ గ్యాంగ్‌ లను నిర్దాక్షిణ్యంగా అణచివేయటాన్ని అమెరికాలోని మితవాదులు విపరీతంగా పొగుడుతున్నారు.
పన్నులు ఎక్కువగా ఉండటమే సమస్య అని అమెరికన్‌ మితవాదులు తరచూ చెబుతుంటారని, అది సరియైనది కాదని ఎల్‌ సాల్వెడార్‌ అధ్యక్షుడు అన్నాడు. అసలు సమస్య ఏమిటంటే ఎక్కువ స్థాయిలో పన్నులు చెల్లించి ప్రభుత్వాన్ని నడుపుతున్నామనే భ్రమలో వీరు ఉంటారని, వాస్తవం అది కాదని ఆయన అన్నాడు. అసలు జరుగుతున్నదేమంటే ప్రభుత్వం ట్రెజరీ బాండ్ల తో నడుస్తోందని, ఈ బాండ్లను ఫెడరల్‌ రిజర్వ్‌(అమెరికా రిజర్వ్‌ బ్యాంక్‌ పేరు) తాను ప్రింట్‌ చేసిన డబ్బుతో, ఆ బాండ్ల హామీతోనే కొంటుందని బర్క్‌లీ అన్నాడు. ఆయన మాటల్లో చెప్పాలంట్ణే ”ప్రభుత్వానికి నిధులు నగదును ప్రింట్‌ చేయటం ద్వారా అందుతాయని, కాగితాన్ని కాగితం హామీతో ప్రింట్‌ చేయటమనే బుడగ అనివార్యంగా పేలుతుంది. ఈ విషయం అమెరికన్లకు, మిగిలిన ప్రపంచానికి అర్థం అయితే మీ కరెన్సీపైన విశ్వాసం పోతుంది. డాలర్‌ పతనం అవుతుంది. దానితోపాటు పశ్చిమ దేశాల నాగరికత పతనం అవుతుంది. ఒకవేళ రాబోయే అమెరికా అధ్యక్షుడు అవసరమైన విధాన నిర్ణయాలను, నిర్మాణంలో మార్పులను చేపట్టకపోతే ఎప్పుడోఒకప్పుడు ఈ బుడగ పేలుతుంది. ప్రభుత్వాన్ని పై నుంచి కింద దాకా రీఇంజినీరింగ్‌ చేయవలసి ఉంటుంది.”
1971లో డాలర్‌ కు బంగారం హామీని రద్దు చేసి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆవిర్బవించిన బ్రెట్టన్‌ వుడ్స్‌ వ్యవస్థ నియమాలను అప్పటి అమెరికా అధ్యక్షుడు రీచర్డ్‌ నిక్సన్‌ ఉల్లంఘించాడు. ఆ వ్యవస్థ లో డాలర్‌ ను ఒక ఫిక్స్‌ డ్‌ రేటులో బంగారానికి మార్చుకునే ఏర్పాటు ఉండేది. అప్పటి నుంచి అమెరికా జాతీయ ఋణం విపరీతంగా పెరిగింది. 1971లో 232బిల్లియన్లు గావున్న అమెరికా జాతీయ ఋణం ఈ సంవత్సరం ప్రారంభంలో 34ట్రిల్లియన్లు (1ట్రిల్లియన్‌ 1000బిల్లియన్లకు సమానం) అయింది. గత జూన్‌ లో అమెరికా జాతీయ ఋణ పరిమితిని పెంచటానికి రిపబ్లికన్‌ శాసన సభ్యులు అధ్యక్ష భవనంతో ఒక ఒప్పందం చేసుకున్నారు. అలా ఒక పెను దివాళాను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ ఒప్పందం 2025దాకా అమలులో ఉంటుంది.
2019లో బర్క్‌లీ అధ్యక్షుడు అయ్యేనాటికి ఎల్‌ సాల్వెడార్‌ లో ఒక లక్ష మందికి 38 హత్యలు జరుగుతుండేవి. వీటిని గత సంవత్సరాంతం కల్లా 2.4కి ఆయన తగ్గించగలిగాడు. 2022లో దేశంలో ఎమర్జన్సీని విధించి 75వేల మంది అనుమానిత హంతక ముఠాలను బర్క్‌లీ జైళ్ళలో పెట్టాడు. ఈ చర్యను మానవ హక్కుల సంఘాలు నిరసించాయి. అమెరికా నగరాలలో విచ్చలవిడిగా సాగుతున్న మాదక ద్రవ్యాల వినియోగాన్ని, విపరీతంగా పెరుగుతున్ననేర ప్రవత్తిని నియంత్రించటానికి తన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ఆయన అమెరికాకు విజ్ఞప్తి చేశాడు